అమిత్‌షా,పియూష్‌గోయల్‌లతో సీఎం కేసీఆర్‌ భేటీ


న్యూఢల్లీి,సెప్టెంబరు 27(జనంసాక్షి):మరో సారి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రెండు రోజుల్లో ఇది రెండో భేటీ. సీఎం కేసీఆర్‌ వెంట డీజీపీ మహేందర్‌ రెడ్డి ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చర్యలపై డీజీపీ అమిత్‌ షాకు ప్రెజెంటేషన్‌ ఇచ్చినట్లు సమాచారం.మావోయిస్టుల కట్టడికి , అభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, గ్రేహౌండ్స్‌ ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అలాగే అభివృద్ధి పనులు ఏ విధంగా చేపడుతున్నారు అనే అంశాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ బల్లా, ఐబీ చీఫ్‌ అరవింద్‌ కుమార్‌ కి డీజీపీ మహేందర్‌ రెడ్డి ఒక పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ ఇచ్చినట్లు సమాచారం.ఎటువంటి చర్యలతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వారి కార్యకలాపాలను అరికట్టవచ్చు.. వారికి నిధులు రాకుండా ఏ విధంగా అడ్డుకట్ట వేయవచ్చు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై ప్రెజెంటేషన్‌ సమర్పించనున్నట్లు తెలుస్తోంది.అంతకుముందు కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కేసీఆర్‌ కలిశారు. సీఎంతో పాటు చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌, తెలంగాణ సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎలక్షన్‌ రెడ్డి కూడా గోయల్‌తో భేటీ అయ్యారు. గంటా నలభై నిమిషాల పాటు గోయల్‌తో సమావేశమయ్యారు.సీఎస్‌ సోమేష్‌ కుమార్‌తో కలిసి ఆదివారం కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ తో భేటీ అయిన కేసీఆర్‌… సోమవారం మరోసారి కలిశారు. కేసీఆర్‌ వెంట ఎంపీలు నామా నాగేశ్వర్‌ రావు, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, వెంకటేష్‌ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ ఉన్నారు. వరిధాన్యం కొనుగోళ్లు అంశంపై దాదాపు గంటన్నరపాటు పియూష్‌ గోయల్‌ తో కేసీఆర్‌ చర్చించారు. ఈసమావేశంలో కేంద్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఎఫ్‌సిఐ ద్వారా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా సీఎం రెండు రోజులుగా ఢల్లీిలో ప్రయత్నాలు చేశారని, ఇందులో భాగంగానే పియూష్‌ గోయల్‌ తో మరోసారి భేయి చర్చించారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ చెప్పారు. కేంద్ర మంత్రి నుంచి ఇంకా స్పష్టత రాలేదని, మరో మూడు రోజుల సమయం కావాలని కేంద్రమంత్రి కోరినట్లు తెలిపారు. గతంలోలాగా ధాన్యాన్ని కొనలేమని కేంద్రం రాతపూర్వకంగా రాష్టాన్రికి తెలిపిందన్నారు.ఇదిలా ఉంటే ఆదివారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో మావోయిస్టుల నిర్ములన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.