అవన్నీ అసత్యం : మంత్రి ఏరాసు

హైదరాబాద్‌, జూలై 24 : గాలి బెయిల్‌ స్కాంతో తనకు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని ఖండించారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ దురుద్దేశంతోనే కొందరు కావాలని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గాలి జనార్దనరెడ్డికి డబ్బులు తీసుకుని బెయిల్‌ మంజూరు చేసిన వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తన తప్పు ఉందని తేలితే రాళ్లతో కొట్టండంటూ ఆవేశంగా అన్నారు. గాలి జనార్దనరెడ్డికి తాను సమీప బంధువును అయినందువల్లే తనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ స్కాం నుంచి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిని తప్పించేందుకే తనను ఇందులో ఇరికించారంటూ న్యాయమూర్తి లక్ష్మీనరసింహా రావు ఎసిబికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో మంత్రి ఏరాసు పై విధంగా స్పందించినట్టు తెలుస్తోంది.