అవినీతి పరుడు జగన్‌ను కఠినంగా శిక్షించాలి : పాల్వాయి

హైదరాబాద్‌, జూన్‌ 6 : వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లాంటి అవినీతి పరుడిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థనరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం నాడు సిఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని జగన్‌ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటి చేసిన ఆయనను వదిలిపెడితే వ్యవస్థ మరింత భ్రష్టుపట్టిపోతుందన్నారు. లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన జగన్‌ను ఇంత కాలం విచారణ జరపడం సరైంది కాదని తక్షణమే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాల్వాయి డిమాండ్‌ చేశారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి సైతం అవినీతికి పాల్పడి దానికి మంత్రులను, అధికారులను బాధ్యులను చేశారని ఆరోపించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి లక్షల కోట్ల రూపాయల ఆస్తులకు యజమానులయ్యారంటే తండ్రీ  కొడుకులు ఇద్దరూ ఎంతటి అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతోందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  కంటే వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండింతలు అవినీతిపరుడని  విమర్శించారు. అవినీతికి పాల్పడిన వారికి ఎక్కడా ఆదరణ లభించదని అన్నారు. జలయజ్ఞం పేరుతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కొందరు మంత్రులు, మరికొందరు అధికారులు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దీనిపై హైకోర్టు సిబిఐ విచారణ చేపట్టాలని పాల్వాయి విజ్ఞప్తి చేశారు.    జగన్‌మోహన్‌రెడ్డి దోపిడీ చేసిన అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాదీనం చేసుకొని పేదలకు పంచిపెట్టాలని ఆయన కోరారు.

తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సమైక్య వాదులు ప్రయత్నిస్తున్నారని పాల్వాయి అన్నారు. వారి ప్రయత్నలు నేరవేరబోవని తెలంగాణపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోరుకునే వారు రాష్ట్రంలో కేవలం 20 శాతం మంది మాత్రమే నని విజయవాడ ఎంపీ లగడ పాటి చేసిన వ్యాఖ్యలను హాస్యస్పదమని పాల్వాయి అన్నారు. లగడ పాటి జోకర్‌ లాంటి వాడని, ఆయన లాంటి జోకర్లు మరెందరో ఉన్నారని పాల్వాయి అన్నారు.