ఆంధ్రలో ఉపాధి హామీ అమలు భేష్‌ జాతీయ సలహా మండలి సభ్యురాలు అరుణారాయ్‌

హైదరాబాద్‌, జూలై 12  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయలేమని జాతీయ సలహా మండలి సభ్యురాలు అరుణారాయ్‌ అన్నారు. గురువారంనాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. అందుచేతే అనుసంధానం కష్టతరమని చెప్పామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం అమలు బేషుగ్గా ఉందన్నారు. సోషల్‌ ఆడిట్‌ విధానం చాలా చక్కగా ఉందని కితాబిచ్చారు. ఉపాధి హామీ అమలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని 100 నుంచి 200 రోజులకు పెంచాలని సూచించారు. అలాగే యూనివర్శల్‌ పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కూడా కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సామాజిక తనిఖీలు బాగున్నాయన్నారు. ఇదిలా ఉండగా మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారన్నారు. ప్రస్తుతం ఆ విషయం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు.