ఆంధ్రాసభలో అవాకులు చవాకులు టీఆర్‌ఎస్ హామీల అమలులో వైఫల్యం
– మహానాడులో రేవంత్
తిరుపతి,మే29(జనంసాక్షి): తిరుపతిలో జరుగుతన్న మహానాడులో ఆంధ్రా ప్రజల మెప్పుకోసం రేవంత్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ ఇచ్చిన హావిూలు ఏమయ్యాయని తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో జరుగుతున్న తెదేపా మహానాడుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘తెరాస ప్రభుత్వం-హావిూల అమలులో వైఫల్యం’ అన్న తీర్మానాన్ని ఆయన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో అమరులైన 1569 మంది కుటుంబాలకు ఇల్లు, ఉద్యోగం, రూ.5లక్షల నగదు ఇస్తామన్న హావిూ ఇంతవరకు అమలు కాలేదని అన్నారు. ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల పట్ల తెరాస నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు. కోటి మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుపేదలకు మూడెకరాల భూమి హావిూలు ఎందుకు అమలు కాలేదో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు, మైనారిటీలకు రిజర్వేషన్లు అంటూ ఇచ్చిన హావిూలు అమలుకు నోచుకోలేదన్నారు. అధికారంలోకి రావడానికి హావిూలు గుప్పించిన కేసీఆర్… ఆ తర్వాత వాటిని గాలికొదిలేశారని విమర్శించారు.