సస్పెండైన అదనపు కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు..
` భారీగా అక్రమాస్తులు గుర్తించిన అధికారులు
హనుమకొండ(జనంసాక్షి): సస్పెన్షన్‌లో ఉన్న హనుమకొండ అదనపు కలెక్టర్(రెవెన్యూ) వెంకట్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. దీంతో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అతడి ఇల్లు సహా ఏడు చోట్ల సోదాలు చేపట్టారు. సోదాల్లో వెంకట్‌రెడ్డి వద్ద భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు తేల్చారు. రూ.4.65 కోట్లు విలువ చేసే విల్లాతోపాటు ఒక ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించారు. రూ.60లక్షలు విలువ చేసే వ్యాపార దుకాణం, రూ.65లక్షలు విలువ చేసే ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు ఇంట్లో రూ.30 లక్షల నగదుతో పాటు రూ.44.03 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 297 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గతనెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ వెంకట్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. పాఠశాలకు అనుమతి విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారు. దీంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది.


