ఆర్కె బీచ్‌లో ప్రత్యేక పూజలు
విశాఖపట్టణం,ఫిబ్రవరి17(జనంసాక్షి ): మహాశివరాత్రి సందర్భంగా టీఎస్‌ఆర్ సేవాపీఠం ఆధ్వర్యంలో ఆర్కేబీచ్‌లో ఏర్పాటుచేసిన కోటిలింగాలకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు మోహన్‌బాబు, శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తదితరులంతా కలిసి పవిత్రజలాలు, పండ్లరసాలతో కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రజాసంక్షేమం కోసం యాగం నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ జిల్లా అనకాపల్లిలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. భోగలింగేశ్వరస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనకాపల్లి పరిసరాలు మంగళవారం శివనామ స్మరణతో మార్మోగాయి.మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎస్. రాయవరం మండలంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని సర్వసిద్ధి కొడుప్రోలు, గుమ్ములూరు తదితర గ్రామాల్లోని ఆలయాలకు భక్తులు విచ్చేసి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించారు.