ఇదేమి భరోసా యాత్ర
ఎవరి గోస… ఎవరికి భరోసా
తెరాస జిల్లా అధ్యక్షులు జీ.వి రామకృష్ణ రావు.
మానకొండూరు,( జనం సాక్షి)
మానకొండూరు మండల పరిధిలోని గ్రామాల్లో భాజపా గత రెండు రోజులుగా చేపట్టిన ప్రజా గోస, బీజేపీ భరోసా యాత్ర కార్యక్రమంలో చేపట్టిన బైక్ ర్యాలీ తో ఎవరి గోస తీర్చారో, ఎంతమందికి ఏ భరోసా కల్పించారో చెప్పాలని తెరాస జిల్లా అధ్యక్షులు జీ.వి రామకృష్ణ రావు డిమాండ్ చేశారు. పెట్రోల్ ధర పెంచి నందుకు, ప్రధాని మోడీ కోటి ఉద్యోగాలు కల్పించినందు కా జన్ ధన్ ఖాతాలలో 15 లక్షల రూపాయలు జమ చేశారని బైక్ ర్యాలీ నిర్వహించా రా అని ఎద్దేవా చేశారు. చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు, భాజపా నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెరాస పార్టీ నాయకులను ,ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. శనివారం మానకొండూరు లో జరిగిన మీట్ ద ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిర్విర్ధంగా తోసిపుచ్చారు. మానకొండూరు నియోజకవర్గం లో అభివృద్ధి కాన రాకుంటే విశ్వేశ్వర్ రెడ్డి కి ఉచిత కంటి ఆపరేషన్ కు సహకరిస్తామన్నారు. కళ్ళు లేని కబోది లా వ్యవహరించడం సరి కాదని సూచించారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కరీంనగర్ కు చేసిన అభివృద్ధి ఏమిటో నిరూపించాలన్నారు. మానకొండూరు చెరువు కట్ట 6 కోట్లతో అభివృద్ధి పరచమని అది కానరా లేదా అని సూటిగా ప్రశ్నించారు. కొండా వాక్యాల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో నాయకులు మొహం చాటేసే పరిస్థితి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని జడిసి అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడేటప్పుడు అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని మాట్లాడాలని విశ్వేశ్వర్ రెడ్డి కి సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.ఈ సమావేశంలో జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ముంజంపల్లి సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, శాత రాజు యాదగిరి వార్డు సభ్యులు బోడ రాజశేఖర్ , కొండ్ర నిర్మల, పిట్టల మధు, ఉండండి శ్యాంసన్, దండబోయిన శేఖర్, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, పిండి సందీప్, ఇస్కుల్ల ఆంజనేయులు అనిల్ తదితరు లున్నారు.