ఇరాన్‌ ప్రభుత్వ సైట్‌ను హ్యాక్‌ చేసిన బిబిసి?

టెహ్రాన్‌, జూలై 6: తమ సైట్‌ను హ్యాక్‌ చేసిందని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఆరోపించింది. కానీ బిసిసి ఈ విషయాన్ని ఖండించింది. ఇరాన్‌లో అణుకార్యక్రమం గురించి ప్రజలలో సర్వే నిర్వహించగా ఆ ఫలితాలను తారుమారు చేసేందుకు బిబిసి హ్యాకింగ్‌కు పాల్పడినట్లు ఇరాన్‌ టీవీ ఆరోపించింది. ఇరాన్‌ అణుబాంబులను తయారు చేస్తోందని పశ్చిమ దేశాలు అనుమానిస్తుండగా తాము కేవలం శాంతియుత ప్రయోజనాల కోసం అణు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఇరాన్‌ వాదిస్తోంది. బిబిసి వ్యాఖ్యానం ప్రకారం పోల్‌ అధ్యయనంలో 63 శాతం ఇరాన్‌ అణు కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని కోరారు. అలా చేసినట్లయితే ఇరాన్‌పై పశ్చిమదేశాల ఆర్థిక ఆంక్షలు తొలగిపోతాయని వారు భావిస్తున్నారు. బిబిసి ఫార్సీ భాషా ప్రసారంలో ఈ వార్త ప్రసారం చేశారు. కాగా తమ ప్రజలలో 24 శాతం మందే అణు కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారని ఇరాన్‌ టీవీ చెబుతోంది. మిగతవారు పశ్చిమదేశాలపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. గల్ఫ్‌ నుంచి పశ్చిమ దేశాలకు చమురు ఎగుమతి కాకుండా ఇరాన్‌ అదుపులోకి హోర్ముజ్‌ జలసంధిని మూసివేయాలని తమ ప్రజలు కోరుతున్నట్లు ఇరాన్‌ టీవీ వెల్లడించింది.