ఇరాన్‌ సుప్రీం లీడర్‌తో పాక్‌ ప్రధాని భేటీ

` దయాదితో భారత్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో సమావేశానికి సంతరించుకున్న ప్రాధాన్యం
టెహ్రాన్‌(జనంసాక్షి):దక్షిణాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి కోసం ఇరాన్‌ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రశంసించారు. ప్రస్తుతం ఇరాన్‌ పర్యటనలో ఉన్న ఆయన సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీతో సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ షరీఫ్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ముస్లిం సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఖమేనీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వం, బలమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయన్నారు. దక్షిణాసియాలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఇరాన్‌ పోషించిన మధ్యవర్తిత్వాన్ని ఆయన ప్రశంసించారు. ముస్లిం దేశాల్లో శాంతి, సామరస్యం, అభివృద్ధికి తమ సహకారం అందిస్తామని షరీఫ్‌ ఈ సందర్భంగా వెల్లడిరచారు. పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌, ఆర్మీ చీఫ్‌ ఆసీమ్‌ మునీర్‌ ఆయన వెంట ఉన్నారు. దీనికి ముందు ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజిష్కియాన్‌తో షరీఫ్‌ భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇండియా యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటే తామూ దీటుగానే స్పందిస్తామన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తమకు అప్పగిస్తేనే పాకిస్థాన్‌తో చర్చలు జరుపుతామని భారత్‌ ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.