హరియాణాలో విషాదం
` ఆగి ఉన్న కారులో.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి ఆత్మహత్య
ఛండీగఢ్(జనంసాక్షి):రోడ్డు పక్కన ఆగిఉన్న కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకోవడంతో హరియాణాలోని పంచకులలో కలకలం రేగింది. బాగేశ్వర్ బాబాగా ప్రచారంలో ఉన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చిన కుటుంబం..అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఈ తీవ్ర నిర్ణయం తీసుకొంది. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి ఓ కారు తమ కారు వెనుక పార్క్ చేసి ఉండడం గమనించిన స్థానికుడు దాని వద్దకు వెళ్లగా ఓ వ్యక్తి అక్కడి కాలిబాటపై కూర్చొని ఉన్నాడు. కారు ఇక్కడ ఎందుకు పెట్టావని ప్రశ్నించగా.. తన పేరు ప్రవీణ్ మిట్టల్ అని.. బాగేశ్వర్ ధామ్ నుంచి తిరిగి వెళ్తున్నామని..రాత్రి ఉండడానికి హోటల్‌లో రూమ్ దొరక్కపోవడంతో అక్కడ ఆగినట్లు తెలిపాడు.కారును అక్కడి నుంచి మరో చోటుకి మార్చుకోవాలని సూచించగా.. అతడు వెళ్తుంటే కార్‌లో పలువురు అచేతన స్థితిలో పడి ఉండడాన్ని గమనించినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో అతడిని నిలదీయగా తమ కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకున్నారని.. తానూ ఐదు నిమిషాల్లో చనిపోతానని చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆరుగురు మృతి చెందగా..చికిత్స పొందుతూ ప్రవీణ్ ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్ మాట్లాడుతూ.. మృతులను దెహ్రాదూన్‌కు చెందిన ప్రవీణ్ మిట్టల్, అతడి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిగా గుర్తించినట్లు తెలిపారు. కుటుంబం మొత్తం విషం తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటారన్నారు. కారు నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని.. కుటుంబానికి పెద్ద మొత్తంలో అప్పులు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉండటంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో ఉందని వెల్లడిరచారు.