ఉన్నత పోస్టుల భర్తీలో మోడీ నిర్లక్ష్యం
` ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల పట్ల వివక్ష
` ఇది మనువాదం యొక్క కొత్త రూపం : రాహుల్
న్యూఢల్లీి(జనంసాక్షి):ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల వారి పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి తరగతుల చెందిన వారి పట్ల మోడీ ప్రభుత్వం చూపుతున్న వివక్షను వ్యవస్థాగత వివక్షగా రాహుల్ అభివర్ణించారు. ఈ తరగతులకు చెందిన అర్హత కలిగిన అభ్యర్థులను ఎన్‌ఎఫ్‌ఎస్ (నాట్ ఫౌండ్ సూటబుల్) అని తిరస్కరిస్తున్నారు. ఇది మనువాదం యొక్క కొత్త రూపం అని రాహుల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ’అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబిసి తరగతులకు చెందిన అభ్యర్థులను నాయకత్వ పాత్రల నుండి మినహాయించడానికి కేంద్రం ఉద్దేశపూర్వకంగానే వారిని అనర్హులుగా మార్చేస్తుంది. ఢల్లీి విశ్వవిద్యాలయంలో 60 శాతం రిజర్వ్‌డు ప్రొఫెసర్ పోస్టులు, 30 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. సమానత్వానికి విద్య ఒక సాధనం అనే బిఆర్ అంబేద్కర్ దృక్పథాన్ని మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలకు చెందిన వారిని ఉద్దేశపూర్వకంగానే ’నాట్ ఫౌండ్ సూటబుల్’ అని తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఈవిధమైన చర్యలతో రాజ్యాంగంపై దాడి చేస్తోంది. సామాజిక న్యాయ ద్రోహానికి పాల్పడుతోంది. ఐఐటిలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు ఇలా అన్నిచోట్ల వీరిపై కుట్ర జరుగుతోంది. వీరు చేసే పోరాటం విద్య కోసమో, ఉపాధి కోసమో చేసే పోరాటం కాదు. ఇది హక్కులు, గౌరవం, భాగస్వామ్యం కోసం చేసే పోరాటమని’ అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. తాను ఢల్లీి యూనివర్సిటీ- స్టూడెంట్ యూనియన్ (డియుఎస్‌యు) విద్యార్థులతో మాట్లాడానని.. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు అమలు చేస్తున్న రిజర్వేషన్లకు వ్యతిరేక చర్యపై పోరాటం చేస్తామని ఆయన అన్నారు.