ఏ తరహా సమావేశానికి అయినా నేను సిద్ధమే
రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలో పుతిన్ సేనలు విరుచుకుపడుతున్నాయి . ఉక్రెయిన్ ఈశాన్య సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను మాస్కో సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో రష్యా దండయాత్రను ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా కీలక ప్రతిపాదన చేశారు. “ద్వైపాక్షిక చర్చలకు పుతిన్ కు ఇష్టం లేకపోతే.. త్రైపాక్షిక చర్చలైనా ఫర్వాలేదు. ఏ తరహా సమావేశానికి అయినా నేను సిద్ధమే” అని జెలెన్స్కీ ప్రతిపాదించారు. తనతోపాటు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి చర్చల్లో పాల్గొనాలనే ఉద్దేశంలో ఆయన పిలుపునిచ్చారు. అలాగే శాంతి ఒప్పందానికి రాకుండా ముందుకు వెళ్తున్న రష్యాపై అమెరికా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.పుతిన్ దూకుడుపై అమెరికా అధ్యక్షుడు అసహనం వ్యక్తంచేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన నిప్పుతో ఆడుకుంటున్నారని అన్నారు. “ఇక్కడ నేను లేకుండా ఉండిఉంటే రష్యాకు చాలా చెడు జరిగి ఉండేది. చాలా చాలా నష్టం జరిగి ఉండేది. ఈ విషయాన్ని పుతిన్ తెలుసుకోవడం లేదు” అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా అతి పెద్ద వైమానిక దాడి చేసిన సంగతి తెలిసిందే . దానిపై కూడా ట్రంప్ తీవ్రంగా స్పందించారు.”పుతిన్ నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ కొన్ని సార్లు ఆయనకు ఏం అవుతుందో అర్థం కావట్లేదు. పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అవసరం లేకపోయినా చాలా మందిని చంపేస్తున్నారు. ఇక్కడ నేను కేవలం సైనికుల గురించే మాట్లాడట్లేదు. కారణం లేకపోయినా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. ఆయన ఉక్రెయిన్ లో కొంత భూభాగాన్ని కాదు.. ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన దృష్టిలో అది సరైనదే కావొచ్చు.. కానీ, అది రష్యా పతనానికే దారితీస్తుంది” అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్లు తక్షణమే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభిస్తాయని కొన్నిరోజుల క్రితం ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన ప్రకటనకు తగ్గట్టుగా అడుగులు పడలేదు. దాంతో అధ్యక్షుడి మాటల్లో ఆ చికాకు కనిపిస్తోంది.