ఈద్గా పరిసరాలను శుభ్రం చేయాలి

కరీంనగర్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : నగరంలోని అతి ప్రాముఖ్యత కలిగిన ఈద్గా చుట్టూ మురుగునీరు  చేరి అపరిశుభ్రంగా తయారైందని, కావున వెంటనే ఈద్గా పరిసరాలను శుభ్రం చేయాలని ఐంఐఎం జిల్లా నాయకులు అబ్బాస్‌ సమీ నగరపాలక సంస్థ అధికారులను కోరారు. ఈద్గా పరిసర ప్రాంతాల డ్రైనేజీలు లేకపోవడం ద్వారా చుట్టు పక్కల ఇండ్ల నుంచి వచ్చే మురుగునీరు నడిరోడ్డుపై పారుతుండడం వల్ల ఆ ప్రాంత వాసులు కూడా నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పవిత్రమైన ఈద్గా పరిసరాలలో మురుగునీరు పారడం వల్ల మనోభావాలు దెబ్బతింటాయనీ తెలిపారు. రంజాన్‌ మాసం నడుస్తున్న ఈ సమయంలో కూడా అధికారులు ముందస్తు పారిశుద్ధ్య చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. రంజాన్‌ పండుగ సందర్భంగా వేలాది మంది ముస్లింలు సోదరులు ఈద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొంటారనీ, అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆ ప్రాంతంలోని ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీరుబయటకు వెళ్లేందుకు డ్రైనేజీ సిస్టంను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని వల్ల మరుగు నీరు ఈద్గా వద్దకు రాకుండా ఉంటుందన్నారు. పండుగ దగ్గర పడుతున్నందున అధికారులు వెంటనే ఈదా,్గ పరిసర ప్రాంతాలను శుభ్రపర్చాలని కోరారు. ఇక నైనా ఈద్గా చుట్టు ఆవరణలోకి మురుగునీరు రాకుండా మున్సిపల్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు.