ఈ తనిఖీలు నిరంతరం కొనసాగాలి

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆదాయానికి గండికొడుతున్న ప్రైవేటు బస్సులకు కళ్లం వేసే విషయంలో ఉదాసీన వైఖరి అవలంబిస్తూ వచ్చిన రాష్ట్రప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు పూనుకున్నది. షోలాపూర్‌ వద్ద జరిగిన షిర్డీ బస్సు ప్రమాదంతో ఒక్కసారిగా మేల్కొన్న రాష్ట్రప్రభుత్వం ప్రైవేటుపై వేటు వేయడం ముదావహం. షోలాపూర్‌ ఘటన దరిమిలా రోడ్డు రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులను నడిపే ట్రావెల్‌ ఏజెన్సీలపై దాడులు జరిపింది. అనంతరం బడి బస్సుల తనిఖీలు నిర్వహించిన సదరు అధికారులు ఇప్పుడు టూరిస్ట్‌ బస్సులపై వెంటపడుతున్నారు. గత ఆరు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి.ఈ సందర్భంగా నిబంధనలు పాటించని అనేక బస్సులను జప్తు చేసి కోర్టుకు అప్పగించారు. రాష్ట్రంలో ఏడువేల బడి బస్సులు సామర్థ్యం లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయని రవాణాశాఖ అధికారుల తాజా అంచనా. రాష్ట్రవ్యాప్తంగా 21వేల స్కూల్‌ బస్సులు ఉండగా, వాటిలో ఏడువేలకు పైగా స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ లేనివే అంటే ఆందోళన కలిగిస్తోంది.ఈ డొక్కు బస్సుల్లో ఇంతకాలం విద్యార్థులు ప్రయాణిస్తున్నారంటేనే గగుర్పాటు కలుగుతోంది. ఆర్టీఏ అధికారులకు ఈ విషయం తెలిసికూడా అచేతనంగా ఎందుకున్నారో మనకు తెలియనిది కాదు.ఫిట్‌నెస్‌ లేని ఈ డొక్కు బస్సుల్లో చిన్నారుల ప్రాణాలకు భద్రత ఎవరు కల్పిస్తారన్నదే ఇక్కడ ప్రశ్న. ఏప్రిల్‌ నెలాఖరు వరకు ప్రతి బస్సుకు సామర్థ్య పరీక్ష చేయించుకున్న తరువాతే జూన్‌ నుంచి విద్యార్థులను ఎక్కించుకోవాలని, మే నెలాఖరులోగా సామర్థ్య పరీక్ష నిర్వహించుకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు గతంలో చేసిన హెచ్చరికలను ప్రైవేటు ఆపరేటర్లు ఖాతరు చేసినట్లు కనిపించడం లేదు. బస్సులకు ఫిట్‌నెట్‌ పరీక్షలు చేయించకుండా తిప్పుతున్న బస్సులతోపాటు కాలంచెల్లిన డొక్కు బస్సులను రోడ్లపై తిప్పుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేటు బస్సు ఆపరేటర్ల ఆగడాలకు కళ్లెం వేయాలంటే వారిపై నిరంతర నిఘా, తనిఖీలు,దాడుల పరంపర కొనసాగుతూనే ఉండాలి.
ప్రైవేటు బస్సు ప్రమాదాల వల్లనైతేనేమి, ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై అధికారులు తీసుకుంటున్న చర్యల వల్లనైతేనేమీ ఇప్పుడు ఆర్టీసీ ఆదాయం పెరుగుతోంది. షోలాపూర్‌ వద్ద జరిగిన షిర్డీ వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదంలో ముప్పయి మంది మరణించిన ఘటనతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇందుకు గత నాలుగు,ఐదు రోజులుగా పెరిగిన ఆర్టీసీ ఆక్యూపెన్సీయే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరగడమే కాకుండా ఆ సంస్థను నష్టాల నుంచి లాభాలబాటలో నడిపించవచ్చు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం కూడా మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలి. ప్రైవేటు బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టాలి. ఈ దిశగా ముందుకు సాగితేనే ఆర్టీసీ మనుగడ సాధ్యం.