అసత్య ప్రచారం ఆపండి

` అభివృద్ధి చూసి ఓర్వలేకే ఆరోపణలు
` అబద్దాల ప్రచారంలో కేటీఆర్‌ దిట్ట
` గతంలో లాగా అడ్డగోలు నిర్ణయాలకు మేం దూరం
` ఉపాధి, ఉద్యోగాల కోసం పెట్టుబడుల వేట
` గతంలో ఇచ్చిన జీవోల ఆధారంగానే భూ కేటయింపులు
` ఎవ్వరికీ భూములు దోచిపెట్టే పరిస్థితి లేదు
` కేటీఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి శ్రీధర్‌ బాబు
హైదరాబాద్‌(జనంసాక్షి): పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ రాష్ట్ర ప్రజలకు అసత్యాలు చెబుతున్నాని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం సిఎం రేవంత్‌ నేతృత్వంలో పెట్టుబడుల కోసం, ఉపాధి, ఉద్యోగాల కల్పనకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నదని అన్నారు. అచిర కాలంలోనే తెలంగాణ అనేక విజయాలు సాధించిందని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా అడ్డగోలుగా జీవోలు, చెల్లింపులు చేయడం లేదని, వారి హయాంలో ఏం చేసినా దాని వెనుక ఓ మతలబు ఉండేదని ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.‘మా కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై కేటీఆర్‌ ఆరోపణలు చేశారు. మొత్తం 9,292 ఎకరాల భూమి గురించి మాట్లాడారు. పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భూములను తక్కువ ధరకు ఇస్తోంది. 2023లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం మూడు జీవోలు ఇచ్చింది. ఆ జీవో ప్రకారం హైదరాబాద్‌లోని భూములను ట్రాన్స్‌ఫర్‌కు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ భూమి అమ్ముకున్నట్టు కేటీఆర్‌ మాట్లాడుతున్నారు. ఫ్రీహోల్డ్‌, ల్యాండ్‌ లీజ్‌కు తేడా లేకుండా మాట్లాడారు. 2023లో భారత రాష్ట్ర సమితి తెచ్చిన జీవో ప్రకారమే భూములు ఇస్తున్నాం. భూమి హక్కులు ఉన్న వారికి మేలు చేయాలని చూస్తున్నాం. గత ప్రభుత్వం హయాంలో చాలా భూములు బదిలీ చేశారు. పరిశ్రమలకు ఉపయోగపడాలని గ్రిడ్‌ పాలసీ తీసుకున్నారని అనుకున్నాం. పారిశ్రామిక వేత్తలను ఇబ్బంది పెట్టకూడదు. పెట్టుబడులు రావాలని రాయితీలతో కూడిన పాలసీలు తీసుకుంటాం. కొన్ని రాష్టాల్ల్రో 99 పైసలకే భూములు ఇస్తున్నారు. పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి అనేది మా లక్ష్యం. ఫ్రీహోల్డ్‌ ల్యాండ్‌ ఉన్నవారు పాలసీ ద్వారా అవకాశం ఉంటే దరఖాస్తు చేసుకుంటారని అన్నారు. భారత రాష్ట్ర సమితి నేతలు అభూత కల్పనలతో రాష్ట్ర ప్రజలకు సత్యదూరమైన మాటలు చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత ఆ పార్టీ నేతలకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు రాకూడదు, రాష్ట్ర అభివృద్ధి జరగకూడదు అనేది కేటీఆర్‌ ఆలోచన. ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. కేటీఆర్‌ కొంత మంది పేర్లు చెప్పారు.. వారు ప్రభుత్వంలో లేరు. ఆధారాలు ఉంటే చెప్పండి.. చర్యలు తీసుకుంటాం అని శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా అబద్దాల ప్రచారం మానుకోవాలన్నారు. గతంలో లాగా అడ్డగోలు నిర్ణయాలు జరగడం లేదన్నారు. స్వలాభం అన్నదానికి వారు హయాంలో తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమని శ్రీధర్‌ బాబు అన్నారు.