రాష్ట్రంలో భారీ భూ కుంభకోణం
` మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ
` 4 లక్షల కోట్ల విలువచేసే భూమికి రెక్కలు
` భూములపై వాలిపోతున్న రేవంత్ ముఠా
` నన్ను అరెస్ట్ చేసే ధైర్యం సీఎంకు లేదు
` మీడియా సమావేశంలో కేటీఆర్ విమర్శ
హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో భారీ భూకుంభకోణం జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏకంగా నాలుగు లక్షల కోట్ల విలువచేసే భూమిని కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని ఆయన సంచలన ఆరోపణ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందని విమర్శించారు.తెలంగాణ భవన్‌లో కేటీఆర్ శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూములు ఎక్కడున్నా రేవంత్ ముఠా అక్కడ వాలిపోతోందని అన్నారు. ఎంతో విలువైన భూములపై రేవంత్ కుటుంబసభ్యుల కన్ను పడిరదని ఆరోపించారు. బాలానగర్ పరిసరాల్లో సుమారు 9300 ఎకరాల భూకుంభకోణం జరుగుతోందని చెప్పారు. బాలానగర్, కాటేదాన్, జీడిమెట్లలో రేవంత్ తన వాళ్లకు భూములిచ్చారని విమర్శించారు. మొత్తం నాలుగు లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. జపాన్‌లో ఉన్నప్పుడు కూడా ఆ భూమికి సంబంధించిన ఫైల్‌పై రేవంత్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ప్రతి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్‌లో అతిపెద్ద భూకుంభకోణానికి తెరలేపిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో 2022లో భూముల రెగ్యులేషన్ కోసం చట్టం తీసుకొచ్చామని, భూములకు వంద శాతం ఫీజులు చెల్లించేలా నిబంధన చేర్చామని కేటీఆర్ తెలిపారు. భూములు వేరేవాళ్లకు అమ్ముకుంటే రెండు వందల శాతం చెల్లించాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోకుండానే భూ కేటాయింపులు చేసిందని విమర్శించారు. 30 శాతం చెల్లిస్తే రెగ్యులర్ చేస్తామని ఉత్తర్వులు ఇచ్చారని ఆరోపించారు. ఇకపోతే రేవంత్ రెడ్డి నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయరు. ఈ ఫార్ములా రేస్ కేసులో ఏవిూ
లేదని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధమే అని కేటీఆర్ పేర్కొన్నారు. కడియం శ్రీహరిని కాపాడేందుకు దానం నాగేందర్‌తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ప్రభుత్వం పరువు పోతుందని ముందుగానే ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.



