రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికకు కేబినెట్‌ ఆమోదం

` నేడు జీవో విడుదల చేయనున్న పంచాయతీ రాజ్‌ శాఖ
హైదరాబాద్‌(జనంసాక్షి): గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్‌ కమిషన్‌ నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సులను సర్క్యులేషన్‌ విధానంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రుల వద్దకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు.పంచాయతీలు, వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లపై విధివిధానాలు ఖరారు చేస్తూ రేపు పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవోకు అనుగుణంగా ఎంపీడీవోలు వార్డులకు, ఆర్డీవోలు సర్పంచి పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో మహిళలకు సీట్లు కేటాయించనున్నారు. రేపు, ఎల్లుండి జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయనుంది. రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని, పిటిషన్‌పై విచారణ ముగించాలని ఈనెల 24న హైకోర్టుకు ప్రభుత్వం, ఎస్‌ఈసీ తెలపనున్నాయి. హైకోర్టు అంగీకరిస్తే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూలు విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.
3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఈ నెల 24న హైకోర్టులో విచారణ పూర్తికాగానే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూల్‌ ప్రకటించాలని ఎస్‌ఈసీ భావిస్తోంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. డిసెంబరు 17 వరకు వార్డు సభ్యులు, సర్పంచ్‌ల ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 12 వేల 733 పంచాయతీలు, లక్షా 12 వేల 288 వార్డులు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్‌ నిర్వహించి, అదేరోజున ఫలితాలు ప్రకటించేలా ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.కాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణిక్నుముదినీ గురువారం ఉన్నతాధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఓటర్‌ జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఈ నెల 23న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు. బ్యాలెట్‌ బాక్సులు, ఇంకు తదితర ఎన్నికల సామగ్రిని ఇది వరకే ఎన్నికల సంఘం సేకరించింది. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో వివాదం తేలిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది.