ఉపాధ్యాయులు మంచి విలువలతో కూడిన విద్యను అందించాలి ఎమ్మెల్యే రాంబాబు

కొమరోలు , జూలై 13: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విలువలతో కూడిన, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 32 లక్షల వ్యయంతో నిర్మించిన ఆరు అదనపు తరగతి గదులకు గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాంబాబు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా పాఠశాల ఆవరణలోని సరస్వతి దేవి, మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. తదుపరి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టిసిహెచ్‌ హజరతయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు వెంకటరాంబాబు మాట్లాడుతూ విద్యార్థులు విద్యను కొనసాగించేందుకు పట్టుదల, కృషి ఎంతో అవసరమని అన్నారు. క్రమశిక్షణతో, ఇష్ట పూర్వకంగా విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని అన్నారు. కొమరోలు మండలంలోని మట్టి రోడ్లకు కూడా నోచుకోని గ్రామాలు ఉన్నందున ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలకు మిగిలిపోయిన ప్రహరిగోడ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయగలనని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇప్పుడిప్పుడే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని, మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, విద్యార్థులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. పాఠశాల ముందు ఆర్‌అండ్‌బి రోడ్డులో స్పీడ్‌ బ్రేకర్ల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. సమావేశంలో ఆర్డీవో రాఘవరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆయన సూచించారు. కాన్వెంట్‌ సాంస్కృతిని తగ్గించేందుకు ప్రజలు ప్రయత్నించాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్‌పిటిసి ఎస్‌ వెంకటనాయుడు, ఆర్డీవో రామకృష్ణారావు, తహసీల్దారు చంద్రశేఖర్‌రాజు మండల స్పెషల్‌ ఆఫీసర్‌ చల్లా సుబ్బరాయుడు, ఎంఇఓ సుబ్బారావు, మాజీ మండల ఉపాధ్యక్షులు ఎన్‌ సుబ్బరాయుడు, మార్కాపురం డిఇ భాస్కర్‌బాబు, స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రసన్నాంజనేయుల, ఎఇ పెంచలరావు, కాంట్రాక్టర్‌ సింగరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.