ఎట్టకేలకు రిమ్స్‌ కళాశాలకు ఎంసిఐ అనుమతి

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ కళాశాలకు గాను 5వ సంవత్సరం తరగతుల ప్రవేశానికి అనుమతిస్తూ భారత వైద్య విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మండలి సభ్యులు రిమ్స్‌ కళాశాలను పర్యవేక్షించి రిమ్స్‌ కళాశాల వసతులను పరిశీలించారు. ఈ ఏడాది అనుమతి లభిస్తుందో లేదో అన్న అనుమానాలు తలెత్తాయి. ఎంసిఐ 5వ సంవత్సరానికి అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2004లో ప్రారంభమైన రిమ్స్‌ కళాశాలలో వసతులు, భవనాలు పూర్తి కాలేదు. అప్పటి నుంచి ఎంసిఐ బృందం ఐదు సార్లు అనుమతి విషయమై తనిఖీలు చేస్తూ వస్తోంది. ఈ రిమ్స్‌ కళాశాలలకు నిధులు సక్రమంగా మంజూరు కాకపోవడంతో భవనాల నిర్మాణాలు పూర్తి కాలేదు. ఈ అనుమతితో ఈ ఏడాది ఎంబిబిఎస్‌ కోర్సును 100 మంది పూర్తి చేయనున్నారు. తాజా అనుమతితో శాశ్వత అనుమతి కోసం మార్గం సుగమం కావడంతోపాటు రాబోయే రోజుల్లో ప్రజలకు అన్ని విధాల వైద్య సౌకర్యాలు లభించే అవకాశాలు ఉన్నాయి. శ్వాశత అనుమతి లభిస్తే ఎంబిబిఎస్‌ కోర్సును పూర్తి చేసిన 100 మంది వైద్యులు సంవత్సరం పాటు హౌస్‌సర్జన్‌ ప్రాక్టిస్‌ చేయడమేకాకుండా జిల్లా ప్రజలకు మరింత వైద్య సేవలు అందనున్నాయి.