ఎన్‌డీయేలో చేరుతానని వస్తే.. కేసీఆర్‌ను నేను ఒప్పుకోలేదు

` కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినా నిరాకరించా..
` ఇది రాజరికం కాదని ఆయనకు గట్టిగా చెప్పా..
` భారాసతో పొత్తు ప్రసక్తే ఉండదని నాడే తేల్చేశాను
` తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు బీజేపీని ఆశీర్వదించాలి
` నిజామాబాద్‌ జనగర్జన సభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
నిజామాబాద్‌ బ్యూరో, అక్టోబర్‌ 3 (జనంసాక్షి):ఎన్డీఏ చేరతానని సీఎం కేసీఆర్‌ వెంటపడ్డప్పటికీ ఆప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్‌ అవినీతి, కుటుంబ పాలన కారణంగానే ఆయనను దూరం పెట్టామని అన్నారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన జనగర్జన సభలో ఆయన మాట్లాడారు. కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దన్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణను ఓ కుటుంబం దోచుకుంటోంది. ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణ సాకారమైంది. తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడిరది. కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగింది. కేసీఆర్‌, ఆయన కుమారుడు… ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్‌ఎస్‌ దోచుకుంటోందని దుయ్యబట్టారు. ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదు. కేసీఆర్‌ గతంలో హైదరాబాద్‌ ఎన్నికలపుడు నాతో అప్యాయంగా ఉన్నాడు. ఆర్భాటంగా స్వాగతం పలికాడు.. ఇప్పుడేమైంది..మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిపోయింది. మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదు. కాంగ్రెస్‌ కూటమి రానీయక పోవడంతో మళ్లీ నా దగ్గరికి కేసీఆర్‌ వచ్చాడు. తన కొడుకును ఆశీర్వదించమని అడిగాడు. నేను నిరాకరించాను.. నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి కూడా సీఎం కేసీఆర్‌ భయపడుతున్నాడు.వాళ్లిద్దరూ తెరచాటు ఒప్పందాలు చేసుకున్నారు..తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్‌ ఉంది. కరోనాకు మందు కనిపెట్టారు. నిజాం నవాబులు హైదరాబాద్‌ను వదలకపోతే ఒకే ఒక్క గుజరాతీ బిడ్డ వల్లబాభాయ్‌ పటేల్‌ వారిని తరిమేశారు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన అవసరం లేదు. వేలాది మంది బలిదానం చేసి సాధించిన రాష్టాన్న్రి ఒకే కుటుంబం కబ్జా చేసింది. ఇక్కడి ప్రజల కలలను తుంచేశారు. కాంగ్రెస్‌ వారితో కూడా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదు. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌తో సంబంధం ఉంది. వాళ్లిద్దరు తెరచాటు ఒప్పందాలు చేసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఇలాగే చీకటి ఒప్పందాలు జరిగాయి. ఎన్టీపీసీ విద్యుత్‌ ఉత్పత్తిని తెలంగాణకే వినియోగిస్తున్నారు. రైల్వే, ఆరోగ్య పథకాలు తెలంగాణ ప్రజలకు అంకితం చేశాం. నిజామాబాద్‌ మహిళలు, రైతులకు ధన్యవాదాలు. విూరు ఇచ్చిన అపురూప స్వాగతంతో ధన్యుడిని. ఈ ఎన్నికల్లో నారీ శక్తి చూపించాలి. విూ ఓట్ల బలంతో వాళ్లు బలవంతులు అయ్యారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పీఠం ఇస్తామని కేసీఆర్‌ ప్రతిపాదన పెట్టారని మోదీ చెప్పారు. అయితే ఎన్డీఏలో చేర్చుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పామని మోదీ స్పష్టం చేశారు. ఆ తర్వాత  కేసీఆర్‌ మరోసారి ఢల్లీికి వచ్చి తన కుమారుడు కేటీఆర్‌కు బాధ్యతలు ఇస్తానని.. సహకరించాలని కోరారన్నారు. అయితే తాను విూరేమైనా రాజులా అని ప్రశ్నించాననని మోదీ తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పాన్ననారు. అప్పుడే కేసీఆర్‌ అవినీతి  చిట్టా అంతా తాను చెప్పానన్నారు. అప్పట్నుంచి కేసీఆర్‌ తనను కలవడం మానేశారని చెప్పారు. తన కళ్లలోకి చూడటానికి కేసీఆర్‌ భయపడుతున్నారని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్సే డబ్బులు పంపిందని స్పష్టం చేశారు.
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మోడీ
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆస్పత్రులు, రైల్వేలైన్లు నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది. పవర్‌ ప్లాంట్‌తో తెలంగాణలో ఎంతో మార్పు రానుంది. పెద్దపల్లి పవర్‌ ప్లాంట్‌ను శరవేగంగా పూర్తిచేశాం.ప్లాంట్‌ నుంచి తయారయ్యే విద్యుత్‌లో.. అధిక భాగం తెలంగాణకే కేటాయిస్తాం. ప్లాంట్‌ శంకుస్థాపన చేసింది నేనే.. ప్రారంభించింది నేనే. మా గ్యారంటీలకు ఇదే నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణకు అండగా ఉంటాం. ఇక్కడి ప్రజల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. త్వరలో భారతీయ రైల్వే 100 శాతం ఎలక్ట్రికేషన్‌ అవుతుంది. ఇది మా వర్క్‌ కల్చర్‌ అని చెప్పారు. బీబీ నగర్‌లో నిర్మిస్తున్న ఎయిమ్స్‌ భవనం పనులు చాలా తొందరగా పూర్తవుతున్నాయని.. ప్రజలంతా మేము చేసిన పనులను చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణలో 20 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను మోదీ జాతికి అంకితం చేశారు. మనోహరాబాద్‌`సిద్దిపేట రైల్వేలైన్‌, సిద్దిపేట`సికింద్రాబాద్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
పసలేని ప్రధాని ప్రసంగం
పాలమూరు సభలో పసుపు బోర్డు గురించి ప్రస్తావించినట్టే నిజామాబాద్‌లోనూ మోడీ అవే వ్యాఖ్యలు చేయడం పట్ల బీజేపీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. ఎన్నో వరాలు కురిపిస్తారని ఆ పార్టీ నాయకులు ఆశపడి చివరకు భంగపడ్డారు. విభజన చట్టాలు, ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయాలు ప్రస్తావించకపోవడంతో నిరుత్సాహంతో వెనుదిరిగారు. బీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు తప్ప ఏదీ మాట్లాడలేదని నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్టీ నేతలు.. మోడీ రాకతో మేలు జరుగుతుందని భావిస్తే చివరకు ఎలాంటి ఉత్సాహపూరిత ప్రకటనలు లేకుండానే వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణుల్లో భయం మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభించి, తర్వాతి సభలో రాజకీయ ఉద్దేశమే వ్యక్తపరిచారు గానీ ప్రజలకు చేసే మేలు, భవిష్యత్తుపై ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయారని చర్చించుకుంటున్నారు. జనసేకరణకు ఎంతో కష్టపడ్డ నాయకులకు ప్రధాని పసలేని ప్రసంగంతో నిరాశకు లోనైనట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.