ఏసీపీ నివాసంలో నోట్ల గుట్టలు

` ఆదాయానికి మించి ఆస్తులు
` సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు సోదాలు
హైదరాబాద్‌(జనంసాక్షి):ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో అనిశా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 12 గంటలుగా ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసం, అదే అపార్ట్‌మెంట్లో ఉన్న మరో రెండు ఇళ్లు, సీసీఎస్‌ కార్యాలయం, నగరంలోని మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.సోదాల్లో ఇప్పటి వరకు అధికారులు పలు కీలక డాక్యుమెంట్లతో పాటు రూ.40లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు ప్రస్తుతం పనిచేస్తున్న సీసీఎస్‌లో పలు కేసుల్లో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు మద్దతు పలుకుతున్నారని పలువురు సోదాలు జరుగుతున్న అతని నివాసం వద్దకు వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నారు. సోదాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్ర తెలిపారు.