ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల ముప్పు!

లండన్‌, జూలై 6 : లండన్‌ ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటిష్‌ పోలీసులు ఐదుగురు పురుషులను, ఓ మహిళను అరెస్టు చేశారు. నిఘా విభాగాలతో కలిసి ముందస్తు పధకం ప్రకారం బ్రిటిష్‌ పోలీసులు ఆ అనుమాతులను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌కు వచ్చే ఒలింపిక్స్‌ క్రీడలతో సంబంధం లేదని మెట్రోపాలిటన్‌ పోలీసులు స్పష్టం చేశారు. ఉగ్రవాద చర్యలకు పురికొల్పడం, సిద్ధం కావడం, ప్రేరేపించడం, వంటి చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానంపై పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఓ 29 ఏళ్ల వ్యక్తిని పశ్చిమ లండన్‌లోని వీధిలో అరెస్టు చేశారు. 21 ఏళ్ల యువకుడిని, 30 ఏళ్ల మహిళను పశ్చిమ లండన్‌లోని నివాసంలో అరెస్టు చేశారు. తూర్పు లండన్‌లోని నివాసాల నుంచి 26,18,24 ఏళ్ల వయస్సు గల ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు లండన్‌లోని 8 నివాసాలు, వాణిజ్య కార్యాలయాల్లో ఉగ్రవాద చట్టం 2000 కింద సోదాలు కూడా నిర్వహించారు. లండన్‌ ఒలింపిక్స్‌ త్వరలో ప్రారంభం కానున్నాయి. దేశ దేశాల నుంచి క్రీడాకారులు అక్కడికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో తాజా సంఘటన కాస్తా కలవరం కలిగిస్తోంది.