కరెంటు కోతల వల్ల ఇబ్బందులెన్నో..ప్రశ్నార్ధకంగా మారిన పరిశ్రమల భవిత

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14: వెనుకబడిన జిల్లా అయినా అదిలాబాద్‌లో కరెంటు కోతల వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న పరిశ్రమలు విద్యుత్‌ కోతల కారణంగా తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇప్పటికే అనేక కారణాలతో ఎన్నో పరిశ్రమలు మూతపడడంతో వందలాంది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు అంతంత మాత్రంగానే ఉన్న జిల్లాలో కరెంటు కోతల వల్ల ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. జిల్లాలో మధ్య, చిన్న తరహా పరిశ్రమలపై వేలాది కార్మికుల కుటుంబాలు జీవిస్తున్నాయి. జిల్లాకి తలమానికంగా ఉన్న కాగితం పరిశ్రమ విద్యుత్‌ కోతల వల్ల ఆ పరిశ్రమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని కాగజ్‌నగర్‌ పట్టణంలో ఉన్న సిర్‌పూర్‌ పేపర్‌ మిల్లులో మొత్తం కలిపి సుమారు 5వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి రోజు 300 టన్నులకు పైగా ఉత్పత్తి జరుగుతుంది. ఈ పరిశ్రమకు మొత్తం ప్రతిరోజు సుమారు 35 నుంచి 40మెగా వాట్ల విద్యుత్‌ అవసరం కాగా, యజమాన్యాం సొంతంగా 16మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. మిగిత మెగా యూనిట్లను ట్రాన్స్‌కో నుంచి కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వం తాజాగా పరిశ్రమలకు విద్యుత్‌ ఛార్జీలను భారీగా పెంచడంతో పాటు కోతలను విధించడంతో మిల్లు పరిస్థితి అయ్యోమయంగా మారింది. ఇప్పటికే కొన్ని యూనిట్లను ఉత్పత్తి నిలిపివేయ డంతో కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికుల తగ్గించారు. అదే విధంగా సిరామిక్‌ పరిశ్రమల పరిస్థితి కూడా విద్యుత్‌ కోతల వల్ల కష్టాల్లో పడింది. ఇక చిన్న తరహా పరిశ్రమలు అయితే చెప్పే అవసరం లేదు. ప్రభుత్వం పరిశ్రమలు విధించిన కోతలను ఎత్తివేస్తే తప్ప, కార్మికుల పరిస్థితి చక్కదిద్దె పరిస్థితి లేదు. వెనుకబడిన జిల్లాలో ఉన్న పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కార్మికులు కోరుతున్నారు.