హబ్సిగూడలో అర్ధరాత్రి లారీ బీభత్సం

బ్రేకులు ఫెయిల్‌.. సీఎస్‌ఐఆర్‌ గోడను ఢీకొట్టిన లారీ

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. తప్పిన పెను ప్రమాదం

ఉప్పల్‌/హబ్సిగూడ, ఆగస్టు 20 (జనం సాక్షి): హబ్సిగూడలో అర్ధరాత్రి భారీ ప్రమాదం తృటిలో తప్పింది. బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పిన ఓ లారీ సీఎస్‌ఐఆర్‌ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హబ్సిగూడ స్ట్రీట్‌ నంబర్‌ 8 సమీపంలో అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి వేగంగా వచ్చి సీఎస్‌ఐఆర్‌ గోడను ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాద సమయంలో రహదారిపై రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. బ్రేకులు ఫెయిల్‌ కావడం వల్లే లారీ అదుపుతప్పినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.