అన్ని వర్గాలకు కొత్త పింఛన్లు ఇస్తున్నప్పుడు బీడీ కార్మికులను ఎందుకు విస్మరిస్తున్నారు?

12 ఏళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు..
2014 కట్‌ఆఫ్‌ను పునఃసమీక్షించి అర్హులైన బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి: బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బందెల ధర్మపురి
సిరికొండ, ఆగస్టు 9 (జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు తదితర వర్గాలకు కొత్త పింఛన్లు మంజూరు చేసే దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, బీడీ కార్మికులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎస్సీ మోర్చా సిరికొండ మండల అధ్యక్షుడు బందెల ధర్మపురి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 సంవత్సరాన్ని కట్‌ఆఫ్‌గా నిర్ణయించి బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే 2014 తర్వాత దాదాపు 12 సంవత్సరాలు గడిచినా కొత్తగా అర్హత పొందిన బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్లుగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు, ముఖ్యంగా మహిళలు, తమ కుటుంబాలను పోషించుకుంటూ వచ్చారని, ప్రస్తుతం వృద్ధాప్యంలోకి చేరిన అనేక మంది కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు తదితర వర్గాలకు కొత్త పింఛన్లు అందించే ప్రభుత్వం, అదే విధంగా ఎన్నో ఏళ్లుగా బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్న బీడీ కార్మికుల విషయంలో కూడా న్యాయం చేయాలని కోరారు. “బీడీ కార్మికులు ఏం పాపం చేశారు? 2014 తర్వాత కొత్తగా అర్హత పొందిన కార్మికులు పింఛన్‌కు ఎందుకు దూరంగా ఉండాలి? 12 ఏళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న బీడీ కార్మికుల ఆశలను ఇకనైనా ప్రభుత్వం నెరవేర్చాలి” అని బందెల ధర్మపురి ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2014 కట్‌ఆఫ్‌ను పునఃసమీక్షించి, అర్హులైన బీడీ కార్మికులను కొత్త పింఛన్ల పరిధిలోకి తీసుకురావాలి. బీడీ కార్మికుల సంఖ్య, అర్హతలను గుర్తించి ప్రత్యేకంగా కొత్త పింఛన్లను మంజూరు చేసే విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల సమస్యను ప్రభుత్వం ఇకపై కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కరించి, అర్హులైన ప్రతి బీడీ కార్మికుడికి సామాజిక భద్రత కల్పించాలని బందెల ధర్మపురి కోరారు.



