జడ్చర్ల, కావేరమ్మపేటలలో జోరుగా సంతకాల సేకరణ

జడ్చర్ల, ఆగస్టు 11 (జనంసాక్షి): కావేరమ్మపేట మున్సిపల్ వార్డు భవనంలో జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం విజయవంతంగా చేపట్టారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు కావేరమ్మపేట మునిసిపల్ వార్డు భవనం వద్ద సంతకాల సేకరణను ప్రారంభించి, కావేరమ్మపేట, జడ్చర్ల ప్రాంతాల్లోని దుకాణ సముదాయాలలో, ప్రధాన వీధులు, కూడళ్లలో సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో జడ్చర్ల, కావేరమ్మపేటలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, పుర ప్రముఖులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కదిలివచ్చి ఉద్యమ స్ఫూర్తిని చాటారు. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో సంతకాల సేకరణ విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు