భక్తుల కల్పవల్లి.. శ్రీ బంగారు మైసమ్మ తల్లి

ఆగస్టు 30న బోనాల పండుగ మహోత్సవం

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని

దేవాలయ అభివృద్ధి కమిటీ పిలుపు

జడ్చర్ల, ఆగస్టు 23 (జనంసాక్షి): నమ్మి కొలిచిన భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది కావేరమ్మపేట శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన డాక్ బంగ్లా సమీపంలో ఉన్న ఈ దేవాలయం, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతోంది. దాతల సహకారంతో ఈ దివ్య క్షేత్రం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. కావేరమ్మపేట, జడ్చర్ల, మండల ప్రజలతో పాటు పరిసర గ్రామాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో ఆదివారం బోనాల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 30న (ఆదివారం) శ్రీ బంగారు మైసమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.

శ్రావణ బోనాల మహోత్సవం: బోనాల పండుగ సందర్భంగా మహిళలు, భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. ఈ సందర్భంగా నిత్య పూజలతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

దేవాలయ ప్రత్యేకత: సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వారికి వివాహం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారికి. చీర, సారెతో పాటు ఒడిబియ్యంతో బోనం సమర్పిస్తారు. అమ్మవారిని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం.

బోనాల నిర్వహణకు ఏర్పాట్లు: ఆగస్టు 30న జరిగే బోనాల మహోత్సవానికి దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి బోనాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని కోరారు.