మోటార్ బాగుచేయడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..

– విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకులు మృతి..
– జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం..

మల్హర్, (జనంసాక్షి): పొలంలో పంట కోసం.. ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరిన తండ్రీ కొడుకులు తిరిగి రాలేదు. రోడ్ డ్యాం పక్కన ఉన్న తమ పొలంలో మోటార్ ఆగిపోతే సరిచేయడానికి వెళ్లిన వాళ్లు, శాశ్వతంగా కళ్లు మూశారు. ఈ హృదయ విదారక ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట శివారులో చోటుచేసుకుంది.

– సాయంత్రం వెళ్లినోళ్లు.. ఉదయం శవాలై కనిపించారు..

కాటారం మండలం గంగారం గ్రామం మార్వాడీపల్లికి చెందిన కట్టెకోల బాపు(50), ఆయన కుమారుడు కట్టెకోల మహేష్ (25)లు ఇద్దరూ కలిసి గురువారం సాయంత్రం కొండంపేట శివారులోని తమ వ్యవసాయ పొలంలో ఉన్న మోటార్ పనిచేయడం లేదని వెళ్లారు. రోడ్ డ్యాం సమీపంలోని పొలంలో మోటార్ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. కుమారుడిని కాపాడే క్రమంలో తండ్రి కూడా షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో రైతు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే కొయ్యూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.

– గ్రామంలో విషాద ఛాయలు..

ఒకే కుటుంబంలో కుటుంబానికి ఆధారంగా ఉన్న తండ్రీ కొడుకులు విగతజీవులు కావడంతో గంగారం గ్రామంలో విషాదం అలుముకుంది. బాపు భార్య, కుమార్తెలు కన్నీరుమున్నీరవుతున్నారు. “ఇంటి పెద్ద దిక్కు పోయింది.. ఇక మా బతుకు ఎలా” అంటూ కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి. రైతు కుటుంబానికి ఇది తీరని లోటు. పొట్ట కూటి కోసం, పంట కోసం వెళ్లిన చోట ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా వ్యవసాయ మోటార్లు, విద్యుత్ పరికరాలు సరిచేసేటప్పుడు విద్యుత్ సరఫరా ఆపివేసి, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.