పాము కాటుతో మహిళ మృతి

ఆకునూరులో విషాదం

చేర్యాల ఆగస్టు 14 (జనంసాక్షి) : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బత్తుల పద్మ (55) ఈ నెల 8న తన వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా పాము కాటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి పద్మ మృతి చెందారు. పాము కాటుకు గురైనప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆమె కోలుకుంటారని ఆశించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతురాలు పద్మకు భర్తతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న పద్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె మృతితో బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. పొలాల్లో పాములు సంచరించే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. పద్మ మృతితో ఆకునూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.