కూలి పనికి వెళ్లగా చేనులో పేలిన బాంబు
– మహిళ కూలీకి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గూడెపల్లి గ్రామంలో శనివారం బాంబు పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చేనులో కూలి పనికి వెళ్లిన మహిళా కూలీ కొడవలితో కదిలించడంతో బాంబు పేలి తీవ్రంగా గాయపడింది.
గూడెపల్లి గ్రామానికి చెందిన మోరె రాజు తన 20 గుంటల భూమిలో మిరప తోట పెట్టేందుకు భూమిని దున్నించి, నలుసు ఏరేందుకు ఇద్దరు మహిళా కూలీలను పిలిచాడు. చేనులో నలుసు ఏరే పనులు చేస్తున్న క్రమంలో గుండె స్వర్ణలత (34) అనే మహిళా కూలీకి భూమిలో గట్టిగా ఏదో తగిలింది. దానిని కొడవలితో కదిలించడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. ఈ ప్రమాదంలో స్వర్ణలతకు ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను పరకాలలోని వినూత్న జనరల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
నక్సలైట్లు నాటిన బాంబా..? లేక భూ వివాదమా..?
చేనులో బాంబు పేలడంతో స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో నక్సలైట్ల సంచారం ఉండేది. అప్పట్లో వారు నాటి మర్చిపోయిన బాంబు ఇదేనా అనే అనుమానం ఒకవైపు వ్యక్తమవుతోంది. మరోవైపు భూమి యజమాని మోరె రాజు కుటుంబాన్ని హతమార్చేందుకు ఎవరైనా కక్షతో పొలంలో బాంబు పెట్టారా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. భూ వివాదాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గూడెపల్లి చేనుకు చేరుకుని పరిశీలించారు. బాంబు ఏ రకానికి చెందినది, ఎంతకాలం క్రితం అక్కడ పెట్టారనే కోణంలో ఆరా తీస్తున్నారు. అక్కడ మరేమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అని తనిఖీ చేస్తూ, కూపి లాగుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



