కాంగ్రెస్‌ పాలనలో కార్పొరేషన్‌ నీర్విర్యం : సీపీఐ నేత చాడ

కరీంనగర్‌ జూలై 16 (జనంసాక్షి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో స్థానిక సంస్థల అధికారాలను హరించి, ప్రత్యేకాధికారుల పాలనలో కాలం గడిపి, నగరాన్ని సర్వనాశనం చేస్తూ కార్పొరేషన్‌ను నిర్వ్యీర్యం చేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సీపీఐ నగర సమితి నగరంలో 16 నుంచి 21 వరకు చేపట్టిన పాద యాత్రను సోమవారం గణేషనగర్‌లో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్పెషల్‌ ఆఫీసర్ల పరిపాలన ప్రజలకు సంకటంగా మారిందని ఆరోపించారు. అభివృద్ధి నిలిచిపోయి, ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడన్నారు. మురికి కాలువలతో నగరం కంపు కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరం ప్రక్కనే మానేరు డ్యాం ఉన్నా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇంటి అవసరాల కోసం కూడా కొన్కుక్కునే పరిస్థితి లేదని విమర్శించారు. నగరంలోని పార్కుల స్థలాలను అక్రమిస్తూ రియల్‌ ఎస్టేట్‌ మాఫియా ను సన్నల్లో కార్పొరేషన్‌ పరిపాలన సాగుతున్నదని చాడ ఆరోపించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోమటి రాం గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో జీవనోపాధి లేక పట్టణాలకు వలస వచ్చి కూలీ పని, ఇతర చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ పాద యాత్రలో సీపీఐ నగర కార్యదర్శి కొయ్యడ సృజన్‌ కుమార్‌, కార్యవర్గ సభ్యుడు పొనగంటి కేదారి, ఎం.భాగ్యలక్ష్మి, సహాయక కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కిన్నెర మల్లయ్య, బీర్ల పద్మ, కూనరవి, కొట్టె అంజలి, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.