కాంగ్రెస్‌ విధానాల వల్లే విద్యుత్‌ సంక్షోభం : సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

కడప, జూలై 18 : కాంగ్రెస్‌ పార్టీ అసమర్ధ పాలన వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కడప కలెక్టరేట్‌ వద్ద ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆమరణ దీక్ష శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. దీక్షలో ఉన్న నాయకులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆందోళనకు దిగారని చెప్పారు. అయితే ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని ఆరోపించారు. ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పాదన చేసేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలోని ప్రజలందరికి ఉచితంగా లాంతర్లను పంపిణీ చేసే పథకం చేపడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సిమెంట్‌ ప్యాక్టరీల యాజమాన్యాలు వైఎస్‌ఆర్‌ సిపి నాయకుడు జగన్‌తో కుమ్మక్కై అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్థమైందని, శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, బ్రహ్మయ్య, మచిలిపట్నం ఎంపి నారాయణతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.