కాంట్రాక్టరు నిర్లక్షం: తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్స్‌ వారి ఆత్మకూరి రామారావు పాఠశాలకు చెందిన అదనపు భవన నిర్మాణంలో కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో ఈరోజు తృటిలో పెనుప్రమాదం తప్పింది. భవన నిర్మాణం నిమిత్తం ఇక్కడ బండరాళ్లను జిలెటిన్‌ స్టిక్స్‌తో పేల్చారు. దాంతో బండరాళ్లు ఎగిరిపడి పక్కనే మస్తాన్‌ నగర్‌లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంపై పడ్డాయి. రేకులు గదుల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం పెకప్పు పగిలిపోయింది. విద్యార్థులు భయాందోళనతో పరుగులు తీశారు. అక్కడే ఉన్న చిట్టెమ్మ అనే మహిళకు రాళ్లు తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.