కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఉర్దూలో పరీక్షకు అవకాశం

కరీంనగర్‌, మే 26 : రాష్ట్ర పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్‌ ట్రైనీ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపికలో భాగంగా తొలిసారిగా ఉర్దూలో పరీక్ష రాసే అవకాశం కల్పించామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 17న కానిస్టేబుల్‌ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తామని, ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇటీవల దేహదారుఢ్య పరీక్షలు పూర్తయినట్టు ఎస్పీ వివరించారు. రాత పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లిషులతోపాటు ఉర్దూలోనూ రాసే అవకాశం కల్పించామని ఎస్పీ తెలిపారు. ఉర్దూలో పరీక్ష రాయదల్చుకున్న అభ్యర్థులు జూన్‌ ఒకటో తేదీలోపు నియామక మండలి చీఫ్‌ సూపరింటెండెంట్‌కు రాతపూర్వకంగా తెలియజేస్తూ ఎస్పీ కార్యాలయంతో అందజేయాలని ఆయన తెలిపారు.