కార్పొరేట్‌ కళాశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ..

ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌వి
హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): కార్పొరేట్‌ కళాశాలల ఫీజు దోపిడీ విధానాన్ని అరికట్టండి.. ఆయా కళాశాలల యాజమాన్యాల ఆగడాలకు కళ్లెం వేయండి అంటూ టిఆర్‌ఎస్‌వి నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతేగాక ఇంటర్‌బోర్డు కార్యాలయాన్ని టిఆర్‌ఎస్‌వి కార్యకర్తలు ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం 11గంటల సమయంలో టిఆర్‌ఎస్‌ విద్యార్ధి విభాగం నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్పొరేట్‌ కళాశాలల ఫీజు వసూళ్లను నియంత్రించాలని, ఆయా కళాశాలల ఆగడా లకు కళ్లెం వేయాలని డిమాండు చేశారు. ఇంటర్మీడియట్‌ ఫీజు కింద ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి 50 వేల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. లైబ్రరీ ఫీజులంటూ, అటెండెన్సు ఫీజులంటూ అదనంగా వసూలుచేస్తూ విద్యార్థుల తల్లిదం డ్రులను దోచుకుంటున్నారన్నారు. కార్పొరేట్‌ కళాశాలల ఆగడాలను అరికట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వం అన్ని రకాలుగా కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు విస్మరించారన్నారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలలకు భవనాలే లేవన్నారు. ఇప్పటికైనా 260 ప్రభుత్వ కళాశాలలకు అవసరమైన భవనాల నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని డిమాండు చేశారు. అనంతరం మూకుమ్మడిగా కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఎపిపిఎస్‌సి కార్యాలయం వద్ద..
ఎపిపిఎస్‌సి భవనాన్ని టీఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. పూటకో నిబంధన, రోజుకో రూల్‌ ప్రవేశపెడుతున్నారని, దీంతో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని నినాదాలు చేశారు. ఇప్పటికైనా ఎపిపిఎస్‌సి అధికారులు తమ తీరు మార్చుకోవాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని తెలిపారు. జూనియర్‌ లెక్చరర్ల ఇంటర్వ్యూల విషయంలో నోటిఫికేషన్‌కు విరుద్ధంగా నడుచుకుంటున్నారని అధికారులపై ధ్వజమెత్తారు.