‘కార్ల’ ప్రతిపాదన వెనక్కు : అఖిలేష్‌

లక్కో, జూలై 5 : రాష్ట్ర ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కార్లు కొనుక్కోవచ్చని రాష్ట్ర సిఎం అఖిలేష్‌ యాదవ్‌ చేసిన ప్రతిపాదనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించటంతో విరమించుకున్నారు. మీడియాలో వార్తల వల్ల ఎమ్మెల్యేలు కార్లు కొనుక్కొనేందుకు సుముఖత చూపటం లేదని అందువల్ల నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నానని ఆయన ఇక్కడ విలేకరులకు చెప్పారు. ఎమ్మెల్యేలలో పలువరు పేదలున్నారని వారికి కార్లు కొనుక్కునే స్తోమత లేదని  అందువల్ల వారికి సాయం చేద్దామనే ఉద్దేశంతో తాను ఈ ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. అయితే ఇది ఐచ్ఛికమని అందరికీ తప్పనిసరి కాదని అన్నారు. పాతకార్లలో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో తిరుగుతున్నారని ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. అయితే బిజెపి, బిఎస్‌పి పార్టీలు ఇందుకు విముఖత చూపిస్తున్నాయి. ఈ ప్రతిపాదన వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వారు వాదిస్తున్నారు.