కాలిఫోర్నియా తొలి తెలుగు జ‌డ్జిగా జ‌య బాదిగ‌

  • శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా నియామ‌కం
  • జ‌య బాదిగది ఏపీలోని విజ‌య‌వాడ‌
  • అమెరికాలో తెలుగు మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం

అగ్ర‌రాజ్యం అమెరికాలో తెలుగు మ‌హిళ జ‌య బాదిగ‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. కాలిఫోర్నియాలోని శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా ఆమె నియ‌మితుల‌య్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జ‌డ్జిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి వ్య‌క్తిగా నిలిచారు. 2022 నుంచి ఇదే కోర్టులో క‌మీష‌న‌ర్‌గా కొన‌సాగుతున్నారు.

ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన జ‌య బాదిగ.. హైద‌రాబాద్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. అనంత‌రం అమెరికా వెళ్లిన ఆమె బోస్ట‌న్ విశ్వ‌విద్యాల‌యంలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత‌ శాంటా క్లారా విశ్వ‌విద్యాల‌యం నుంచి లా ప‌ట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ చేశారు.

10 ఏళ్ల‌కు పైగా న్యాయ‌వాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో లాభాపేక్ష లేకుండా ప‌లు కేసుల్లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదించారామె. అలాగే మెక్‌జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగాను ప‌ని చేశారు.