కింగ్‌ఫిషర్‌లో ముదిరిన సంక్షోభం
తాత్కాలిక లాకౌట్
ప్రకటించిన యాజమాన్యం
న్యూఢిల్లీ,అక్టోబర్ 2 (జనంసాక్షి) : కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పాక్షిక లాకౌట్‌ను ప్రకటించింది. ఉద్యోగుల సమ్మె కారణంగా గురువారం వరకూ సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. సంస్థలో ఇటీవల చోటు చేసుకున్న అవాంఛనీయ, హింసాత్మక ఘటనల కారణంగా తాత్కాలికంగా లాకౌట్‌ను ప్రకటిస్తున్నట్లు కింగ్‌ఫిషర్ ఓ ప్రకటన విడుదల చేసింది. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. అలాగే, సంస్థ ఉద్యోగులకు బకాయి పడిన ఆర్నెల్ల వేతనాలను త్వరలోనే చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కింగ్‌ఫిషర్ ఉన్నతాధికారులు డీజీసీఏకు హావిూ ఇచ్చారు. మంగళవారం డీజీసీఏ చీఫ్ అరుణ్ మిశ్రాతో కింగ్‌ఫిషర్ సీఈఓ సంజయ్ అగర్వాల్, వైఎస్ ప్రెసిడెంట్ హితేశ్ పటేల్ భేటీ అయ్యారు. కొంత మంది ఉద్యోగుల కారణంగా లాకౌట్ ప్రకటించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. గురువారం వరకు ప్రయాణాలు నిలిపివేస్తున్నామని, అప్పటివరకు టికెట్ల జారీ ప్రక్రియను ఆపేస్తున్నామని తెలిపారు. సంస్థ ఆర్థిక పరిస్థితులపై డీజీసీఏకు వివరణ ఇచ్చారు. భేటీ అనంతరం సంజయ్ అగర్వాల్ విూడియాతో మాట్లాడుతూ.. త్వరలో చేపట్టబోయే కార్యాచరణపై డీజీసీఏకు వివరించామన్నారు. తమ ఆర్థిక పరిస్థితిని కూడా తెలిపామన్నారు. ఉద్యోగల వేతన బకాయిలపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. త్వరలోనే బకాయిలన్నీ చెల్లిస్తామన్నారు. తాను కూడా వేతనం తీసుకోవడం లేదని తెలిపారు.