నిషేధం ఎత్తివేయండి.. లీగల్‌గా పనిచేస్తాం

ఆపరేషన్ కగార్‌లో ఒకరికి 100 మంది చుట్టుముట్టారు
నంబాల ఎన్‌కౌంటర్ తర్వాత సోను, సతీష్‌ల కుట్ర పార్టీకి అతిపెద్ద దెబ్బ
వాళ్లు శత్రువులతో ములాఖత్ అయ్యారు..
రివార్డు పెంచాలని కిందిస్థాయి వాళ్లు కోరడంపై క్షమాపణలు చెబుతున్నా..
మీడియా సంస్థలతో దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి వెల్లడి
హైదరాబాద్, మార్చి 13 (జనంసాక్షి) : ‘ప్రజల సమస్యల కోసం నిన్నటిదాకా సాయుధులుగా పోరాడాం. చట్టబద్ధ పరిధిలో ఇప్ప్పుడు ప్రజల దైనందిన మౌలిక సమస్యల మీద పోరాటం చేస్తాం. పార్లమెంటరీ రాజకీయాల్లోకి వస్తున్నారని రకరకాల ఊహాగానాలతో తప్ప్పుడు ప్రచారం చేయొద్దు’ అని మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత, అప్రటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితం కోసం బహిరంగ జీవనంలోకి రాలేదని, ప్రజా రాజకీయం కోసం మాత్రమే జనజీవన స్రవంతిలోకి వచ్చినట్టు వెల్లడించారు. అరెస్టయిన స్థితిలో అనివార్యంగా లొంగిపోయాం కానీ చావుకు భయపడలేదన్నారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతం ప్రకారమే మా నడవడిక కొనసాగుతుందని, పార్టీపై నిషేధం ఎత్తివేస్తే లీగల్ ఫ్రేమ్ వర్క్‌లో పనిచేస్తామని చెప్పారు. పట్టణ, మైదాన, అటవీ ప్రాంతాల్లోని అన్నివర్గాల ప్రజల మౌలిక సమస్యలపైనా మా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.ఫిబ్రవరి 24న మావోయిస్టు పార్టీ కీలక నేతలు దేవ్‌జీ, మల్లారాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. తదనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సచివాలయంలో కీలక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలను సీఎం దష్టికి తీసుకెళ్లిన దేవ్ జీ.. తాజాగా శుక్రవారం వివిధ మీడియా సంస్థలతో ముచ్చటించారు. ఆపరేషన్ కగార్, ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు తదితర అంశాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమది లొంగుబాటు కాదని, అడవిని వీడి బహిరంగ జీవితంలోకి వచ్చామని తెలిపారు. మావోయిస్టు పార్టీది చాలా సమగ్రమైన ఏజెండా అని వివరించారు. ‘ఆర్థిక, రాజకీయ, సామాజిక సాంస్కతిక, పర్యవరణం వంటి అంశాలు మా కీలక ఏజెండాలు. భూగోళం సంక్షోభంలో ఉన్నప్ప్పుడు పర్యావరణం గురించి ఆలోచించాం. దళితులు, బీసీల ఆత్మగౌరవ సమస్యలతో పాటు భూ సమస్యలున్నాయి. ఇవి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో మావోయిస్టు పార్టీ ఉంటుంది. కోట్లాది మంది తమకు మావోయిస్టు పార్టీయే నాయకత్వం వహిస్తుందని నమ్ముతున్నారు’ అని దేవ్‌జీ పేర్కొన్నారు. సమాజంలో పరిస్థితులు మారినా పేదరికం, వేధింపులు తగ్గలేదని, దోపిడీ రూపం మారింది కానీ ఆగలేదన్నారు. దోపిడీ ఉన్నంతకాలం మావోయిస్టు ఉద్యమం ఉంటుందని వెల్లడించారు.
హిడ్మాది బూటకపు ఎన్‌కౌంటర్
హిడ్మా లొంగిపోతానని చెప్పినప్పుడు తాము వారించామని, అయితే పోలీసుల ట్రాప్‌లో పడి ఆయన ప్రాణాలు కోల్పోయారని దేవ్‌జీ అన్నారు. హిడ్మాది వంద శాతం బూటకపు ఎన్‌కౌంటర్ అని, ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆయన ఆరోపించారు. ‘ఆపరేషన్ కగార’ సమయంలో బస్వరాజు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోకపోవడం వల్లే ప్రతిఘటన అనివార్యమైందని, ఆ పోరాటంలోనే బస్వరాజును కోల్పోయామని వెల్లడించారు. మరోవైపు, అగ్రనేత గణపతి గురించి స్పందిస్తూ.. 2023లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ఆయనను చివరిసారిగా చూశానని, ఆ తర్వాత ఆయనతో సంబంధాలు లేవని దేవ్‌జీ స్పష్టం చేశారు. సమాజంలో దోపిడీ రూపం మార్చుకుందే తప్ప తొలగిపోలేదని, దోపిడీ ఉన్నంత కాలం ఉద్యమం కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసి, జైళ్లలో ఉన్న వారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.
విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు..
ఆపరేషన్ కగార్ యుద్ధం మొదలయ్యే సమయంలో బస్వరాజు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదు. కేంద్రం పట్టించుకోనందునే ప్రతిఘటన అనివార్యమైంది. ఈ పోరాటంలో బస్వరాజును కోల్పోయాం. ఆయన మరణం అనంతరం కొందరు లోపల(అడవుల్లో).. కొందరు బయట(జనంలో) ఉండాలని నిర్ణయించుకున్నాం అని దేవ్‌జీ చెప్పారు. ఈ క్రమంలోనే హిడ్మా లొంగిపోవాలనుకోవడం, ట్రాప్‌లో పడి ఎన్‌కౌంటర్ కావడం జరిగింది. ప్రస్తుతం గణపతి ఎక్కడున్నారో మాకు తెలియదు. 2023లో చివరిగా సెంట్రల్ కమిటీ సమావేశం జరిగింది. 2023 తర్వాత పార్టీకి దిశా నిర్దేశం చేయడం సాధ్యం కాలేదు. మావోయిస్టు పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. పార్టీ నడవాలంటే డబ్బులు కావాల్సి ఉంటుంది. డబ్బు రూపకంగా కాకుండా.. ఉన్న డబ్బుతో బంగారాన్ని కొనుగోలు చేస్తే బాగుంటుందని భావించా. బంగారాన్ని కొనుగోలు చేశాం. అయితే.. కిలోల కొద్దీ బంగారం, కోట్ల రూపాయల డబ్బు ఉందని మాపైన, పార్టీపైన దురుద్దేశంతో ప్రచారం జరిగిందని దేవ్‌జీ పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలోని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అవ్వాలని నా మనసులో లేదు. ప్రజల్లో ఉండి ప్రజల కోసం లీగల్‌గా పోరాటం చేయడమే నా రాజకీయ జీవితం. జైల్లో ఉన్నవారిని విడుదల చేయాలని కోరాం’ అని అన్నారు.
ఒక్కరికి వందలాది మంది బలగాలు..
ఒక్కో పార్టీ కార్యకర్త లేదా గెరిల్లా వెనుక 100 నుండి 200 మంది బలగాలను మోహరించి, మూడు-నాలుగు అంచెలుగా సైనిక దాడి జరిపారని దేవ్‌జీ వివరించారు. ఒక చిన్న గెరిల్లా దళాన్ని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా 8.5 లక్షలకు పైగా పోలీసు, పారా మిలటరీ, వివిధ రకాల కమాండో దళాలతో పాటు భారత సైన్యం, వాయుసేనను కూడా రంగంలోకి దించి కేంద్రం యుద్ధం చేసిందని పేర్కొన్నారు. తమ లొంగుబాటుకు ఇవన్నీ సెంకడరీ కారణాలైతే.. రాజకీయంగా ఒక బలమైన నినాదాన్ని తీసుకుని ప్రజల ముందుకు వెళ్లకపోవడమే ప్రధాన పొరపాటని ఆయన విశ్లేషించారు. గెరిల్లా ఎత్తుగడలు అజేయమైనవని, కానీ వాటిని సరైన విధంగా ఆచరించకపోవడం వల్లే పార్టీ నిర్వీర్యమైందని దేవ్ జీ వెల్లడించారు. ‘ఆపరేషన్ కగార’ తమకు చాలా చిన్న విషయమని దేవ్ జీ పేర్కొన్నారు. పార్టీలో లక్షలాది మంది ప్రజలతో కలిసి పట్టణాల్లో, మైదానాల్లో, అడవుల్లో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించినట్లయితే.. అంతటి ప్రజా పునాది కలిగిన మావోయిస్టు పార్టీని ఏ ‘ఆపరేషన్ కగార’ కూడా ఏమీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా సకాలంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడమే పార్టీకి నష్టం కలిగించిందని, ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం లేకుండా కేంద్ర బలగాలు తమపై ఎడతెరిపి లేకుండా దాడులు చేశాయని తెలిపారు. పార్టీ వైఫల్యాలను సమీక్షించుకునేలోపే ప్రభుత్వం ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’లాగా ఈ ఆపరేషన్ చేపట్టిందన్నారు.