నేటినుంచి ‘పది’ పరీక్షలు

` భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
` హాల్ టిక్కెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం
` సకాలంలో సెంటర్‌కు చేరుకోవాలన్న అధికారులు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. హాల్ టిక్కెట్ చూపిస్తే దిగాల్సిన చోటు వరకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తారు. ఇకపోతే పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు. ఐదు నిముషాల ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 5,17,727మంది రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన 10,512మంది విద్యార్థులు ఉన్నారు. ఈసారి పైవేటు పాఠశాల నుంచి అత్యధికంగా 2,50,015 విద్యార్థులుండగా, ప్రభుత్వ బడుల నుంచి 2,07,573 మంది, సంక్షేమ గురుకులాల నుంచి 60,139 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 1,582 ప్రభుత్వ, 1,094 పైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. హాల్ టికెట్లు ఇప్పటికే అన్ని పాఠశాలకు పంపించామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. పాఠశాల గుర్తింపు తెలియకుండా సాధారణ దుస్తుల్లోనే విద్యార్థులు పరీక్షకు రావాలని కోరారు. పరీక్షల పర్యవేక్షణకు 144 ప్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటుచేశామన్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మద్యాహ్నం 12:30వరకు ఉంటాయి. పదవ తరగతి పరీక్షల సమయం సవిÖపిస్తున్న కొద్ది విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. ఒత్తిడిని జయించడానికి విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికబద్దంగా చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర ఆలోచనలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో సెల్‌ఫోన్, టీవీ వైపు మనస్సు మరలకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ విద్యార్థి ఏర్పాటు చేసుకున్న టైం టేబుల్ ప్రకారం చదువు కోవాల్సి ఉంటుంది. సందేహాలను విద్యార్థులు ఎప్పటికప్ప్పుడు నివత్తి చేసుకోవాలి. అందుకోసం తరగతి ఉపాధ్యాయులు లేదా, మంచి స్నేహితులు, సీనియర్ల ద్వారా సందేహాలను నివత్తి చేసుకోవాలి.పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి. విద్యార్థిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు ప్రతిక్షణం కషి చేయాలి. అవసరమైన ధైర్యం అందివ్వాలి. పిల్లలు ఎక్కువ సమయం చదువుకే కేటాయిస్తారు కనుక వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన పౌష్టికాహారం అందించే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సమయానికి తగినంత నిద్రపోయేలా కూడా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశాం. ఇప్పటికే రెండు ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించి విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించాం. గణితం, సైన్స్, ఇంగ్లిష్ స్జబెక్ట్‌లలో మంచి మార్కులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మార్చి 14 వ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నాం అని అధికారులు వివరించారు.