కేజ్రీవాల్‌ అభ్యర్థులకు ప్రచారం :అన్నా హజార్‌

భువనేశ్వర్‌: సామాజిక కార్యకర్త అర్వింద్‌ కేజ్రీవాల్‌ నెలకొల్పిన ‘ ఆమ్‌ ఆద్మీ’ పార్టీ తరపు అభ్యర్థులకు ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు అవినీతి వ్యతిరేక ఉద్యమకర్త అన్నా హజారే తెలియజేశారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుకు తాను ప్రచారం చేయబోనని తేల్చి చెప్పారు.

ప్రస్తుతం ఒడిషాలో పర్యటిస్తున్న హజారే శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.  ”కేజ్రీవాల్‌ అభ్యర్థుల తరపున మాత్రమే నేను ప్రచారం చేస్తాను. ఇతర పార్టీల్లో మంచి వ్యక్తులు ఉండవచ్చు. అయితే నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంది?” అన్నారు.

ఇతర రాజకీయ పార్టీలు కుల, వర్గ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింన 75 ఏళ్ళ హజారే, విరాళాల సేకరరణ కోసం ఆ పార్టీలు అక్రమ మార్గాల్లో పయనిస్తున్నాయని మండిపడ్డారుఉ. స్వార్థశక్తులు, కార్పోరేట్‌ సంస్థల నుంచి రాజకీయ పార్టీలు భారీ మొత్తాలను సేకరిస్తున్నాయని, అయితే అంత పెద్ద మొత్తాలను ఇస్తున్నవారి గుర్తింపు తెలియకుండా ఆ మొత్తాలను రూ. 20,000 కంటే తక్కువ భాగాలుగా విడగొట్టి చూపుతున్నాయన్నారు.

రాజకీయ పార్టీలను వ్యక్తులు నియంత్రిస్తున్నారని అన్నా ఆరోపించారు. ” కానీ, కేజ్రీవాల్‌ నాకు బాగా తెలుసు. తన కోసం ఏదీ చేసుకోలేదు. ప్రతి పనీ దేశం కోసమే చేస్తారు.” అని ప్రశంసించారు. అయితే, అభ్యర్థులను తాను పరిశీలించాక అవసరమున్న వారికి ప్రచారం చేస్తానన్నారు.

ఇండియా ఎగెయినెస్ట్‌ కరప్షన్‌ సంస్థ వ్యవస్థాపకులైన అన్నా హజారే గురువారం నుంచీ ఒడిషాలో పర్యటిస్తున్నారు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులు, రైతులు, పలు వర్గాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.