కేటీపీఎస్‌లో బొగ్గు కొరత ఆందోళనలో అధికారులు

ఖమ్మం, ఆగస్టు 2 : జిల్లాలోని పాల్వంచలో గల కేటీపీఎస్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించే బొగ్గు కొరత వేధిస్తోంది. 1720 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల కేటీపీఎస్‌లో రోజూ దాదాపు 24 వేల టన్నుల బొగ్గును వినియోగిస్తుంటారు. కేటీపీఎస్‌ పాత ప్లాంట్‌లో ప్రతిరోజూ 7500 టన్నుల బొగ్గు వినియోగిస్తుండగా, 500 మెగా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల 5వ దశలో ప్రతిరోజూ 8వేల టన్నులు, 500 మెగా విద్యుత్‌ ఉత్పత్తి సమార్థ్యం గల 6వ దశలోని 11వ యూనిట్‌లో 8వేల టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు. అయితే కొద్ది రోజులగా సింగరేణి నుంచి ఆశించిన మేరకు కేటీపీఎస్‌కు బొగ్గు సరఫరా జరగడంలేదు. దీనికితోడు సరఫరా చేసిన బొగ్గులో నాణ్యతలేని గ్రేడ్‌బొగ్గు వస్తుందని కేటీపీఎస్‌ అధికారులు అంటున్నారు. పక్షం రోజులకు సరిపడా బొగ్గు నిల్వ ఉండాల్సిన అవసరం ఉండగా, 30 నుంచి 40 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే 5, 6వ దశలలో నిల్వ ఉంటుంది. ఈ బొగ్గు కేవలం రెండు, మూడు రోజులకు మాత్రమే సరిపోతుంది. పాత ప్లాంట్‌లో సైతం బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా 6వ దశలో సింగరేణి బొగ్గును పూర్తి స్థాయిలో వినియోగించుకుండా ఇండినేషియా దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న విదేశీ బొగ్గును మిక్సింగ్‌ చేసి వాడుతున్నారు. ఇప్పటికైనా జెన్కో అధికారులు ముందు జాగ్రత్తగా సింగరేణి నుంచి నిర్దేశించిన బొగ్గును సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గునుల్లో నీరు నిలువ ఉండడం వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్న తరుణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విద్యుత్‌ ఉత్పత్తికి తీవ్రంగా ఆటంకం కలిగే ప్రమాదం ఉంది.