కొత్త సీసాలో పాత సారా..!

– పుణ్యక్షేత్రంలో ‘సిండికేట్‌’కు ముస్తాబు
– రహస్యంగా కదులుతున్న పావులు
గోదావరిఖని, జూన్‌ 7 (జనంసాక్షి) : హస్యంగా మద్యం వ్యాపార రంగంలోని ‘పెద్ద’లు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మద్యం క్రయవిక్ర యాల్లో చెప్పుకోదగ్గ ప్రాముఖ్యతను కలిగిన గోదావరిఖనిలో కొత్త సీసాలో పాత సారాను నింపడానికి పకడ్బంది ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నెలాఖా రులో ఎక్సైజ్‌ సంవత్సరం ముగుస్తుండటంతో… ప్రభుత్వం కొత్త ఎక్సైజ్‌ సంవ త్సరంలో ప్రకటించిన పాలసీని తమకనుకూలంగా… ఎవరికి చిక్కకుండా… చాకచక్యంగా గతంలో మాదిరిగా తమ జేబులు నింపుకోవడానికి మద్యం వ్యాపారానికి పునాదులు నింపుతున్నారు. ఇటీవల కోల్‌సిటిలో తమ వ్యాపార లావాదేవీలకు సంబంధించి సిండికేట్‌కు ఊపిరిపోయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి… గోదావరిఖని నుంచి సూత్రధారులుగా వ్యవహరిస్తున్న సుమారు డజన్‌ మంది పెద్ద మద్యం వ్యాపారులు తిరుపతికి తరలివెళ్ళారు. అక్కడ సిండికేట్‌కు సంబంధించిన పూర్తి సమాలోచనలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఈ ఎక్సైజ్‌ సంవత్సరంలో గోదావరిఖని కార్మిక నగరంలో 18 వైన్‌షాపులు, 5 బార్‌ షాపులు ఉండగా… ప్రతిరోజు ఈ వైన్‌షాపుల్లో సుమారు రూ.20లక్షల మద్యం వ్యాపారం జరుగుతుండగా… బార్‌షాపుల్లో ప్రతిరోజు సుమారు రూ.3 లక్షల వ్యాపారం జరుగుతోంది. ఈ లెక్కన నెలకు రూ.ఏడున్నర కోట్ల మద్యం వ్యాపారం గోదావరిఖనిలో జరుగుతున్నట్లు అనధికారిక సమాచారం. ఈ వ్యాపారంలో వ్యాపారులు ఆడింది ఆటగా… పాడింది పాటగా… గత కొన్నేళ్ళుగా ఇక్కడ జరుగుతోంది. వైన్‌షాపులన్నీ బహిరంగంగా బార్‌ షాపుల్లాగా వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా… నిబంధనలకు విరుద్ధంగా బార్‌ షాపులు నిర్వహణ జరుగుతుందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నిత్యం నష్టాల్లో ఉన్నామని… ప్రకటించుకునే మద్యం వ్యాపారులు చాప కింద నీరులా… సిండికేట్‌ నీడన లక్షలాది రూపాయలు గడిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా ఉన్నాయి. దీనికి తోడు ఈ ప్రాంతంలో మద్యం అమ్మకాల్లో నకిలీ తాండవిస్తుందనే ఆరోపణలు ఉండగా… ఎక్సైజ్‌ అధికారులు నజారానాలతో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే కూడా ఉన్నాయి. గతంలో ఈ నకిలీ గుట్టు రట్టయిన సందర్భాలున్నాయి. ఏదిఏమైన… ఇక్కడి సిండికేట్‌ కొత్త రూపంలో కార్మిక వర్గంపై కోరలు చాపడానికి… రంగం రహస్యంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి… 15రోజుల కొకమారు తమ మద్యం వ్యాపారానికి సంబంధించిన సిండికేట్‌ కార్యాలయాన్ని అత్యంత రహస్యంగా చీటికిమాటికి మార్చుతుండటం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉండటం కొసమెరుపు.