కొనసాగుతున్న అంగన్‌వాడీ సేవా కేంద్రాలు


చిన్నారులకు పూర్తిస్థాయిలో అందుతున్న బాలామృతం
రాజన్నసిరిసిల్ల,ఆగస్ట్‌26(జనంసాక్షి): పాఠశాలలు, కళాశాలలు మూతబడినా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రం సేవలు కొనసాగిస్తున్నారు. పిల్లలకు బోధన మినహా అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. రాజన్న సిరిస్లిల జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 32,651 మంది చిన్నారులు ఉన్నారు. కేంద్రాలకు వచ్చే పిల్లలు 12,563 మంది ఉండగా 20 వేల 88 మందికి టేక్‌ టుహోం రేషన్‌ కింద బాలామృతం, కోడిగుడ్లు, అందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో 4870 మంది గర్భిణులకు, 3406మంది బాలింతలకు ప్రతీ రోజు ఒకపూట సంపూర్ణభోజనం, కోడిగుడ్లు, పాలు అందిస్తున్నారు. కరోనా సమయంలో భోజనానికి బదులు సరుకులను లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందించారు.
జిల్లాలో 657 పాఠశాలల్లో 73,690 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 534 ప్రభుత్వ పాఠశాలల్లో 49,766 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో బాలురు 22,849 మంది, బాలికలు 26,917 మంది. 123 ప్రైవేటు పాఠశాలల్లో 23,924 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో బాలురు 13,088 మంది, బాలికలు 10,837 మంది. వీరికి ఆన్‌లైన్‌ ద్వారా ఇన్ని రోజులు బోధన కొనసాగించారు. ఇదిలావుంటే 10వ తరగతి విద్యార్థులకు పూర్తి పనిదినాలను కేటాయిస్తే తప్ప వారిని పరీక్షలకు సన్నద్దం చేయలేమని టీచర్ల
అభిప్రాయంగా ఉంది. మిగతా విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం షిప్ట్‌ పద్ధతిలో తరగతులు నిర్వహించినా టెన్త్‌ విద్యార్థులకు మాత్రం పూర్తిస్థాయిలో విద్యను అందించాలన్నారు. అలాగే తరగతి గదుల్లో సామాజిక దూరం పాటించడంతో పాటు విద్యార్థులకు మధ్యాహ్న బోజనం అందించేలా ఏర్పాట్లు జరగాలని అన్నారు.