జూన్‌లోగా యుద్ధానికి ముగింపు పలకాలి

` ఉక్రెయిన్,రష్యాలకు డెడ్‌లైన్ విధించిన అమెరికా
న్యూయార్క్(జనంసాక్షి):ఉక్రెయిన్` రష్యా యుద్ధం ముగింపునకు అమెరికా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో అబుధాబీ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్‌లోగా యుద్ధం ముగింపుపై ఓ ఒప్పందానికి రావాలంటూ ఇరుపక్షాలకు అమెరికా డెడ్‌లైన్ విధించిందని తెలిపారు. ఒకవేళ గడువులోగా లక్ష్యం నెరవేరకపోతే.. దాన్ని సాధించేందుకు ట్రంప్ యంత్రాంగం ఇరుపక్షాలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పారు.“ఈ వేసవి ప్రారంభంలోగా యుద్ధాన్ని ముగించాలని అమెరికన్లు సూచించారు. జూన్ నాటికి అన్ని వ్యవహారాలను కొలిక్కి తీసుకురావాలని చెప్పారు. యుద్ధానికి తెరదించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని హావిÖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఒక స్పష్టమైన షెడ్యూల్ కావాలన్నారు. దీని ప్రకారం సంబంధిత పక్షాలపై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది” అని జెలెన్‌స్కీ విÖడియాతో మాట్లాడుతూ తెలిపారు. మూడో విడత చర్చలు అమెరికాలో నిర్వహించేందుకు ఆ దేశం ముందుకొచ్చిందని, దీనికి తమ తరఫున అంగీకారం తెలిపినట్లు చెప్పారు.దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధానికి తెరదించే ప్రయత్నాల్లో భాగంగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారు. అబుధాబీ వేదికగా నిర్వహించిన రెండో విడత భేటీలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ తదితరులు పాల్గొన్నారు. అయితే, ఇరుపక్షాలూ పరస్పరం ప్రత్యేకమైన డిమాండ్లను వీడకపోవడంతో ఎటువంటి పురోగతి లభించలేదు. డాన్‌బాస్ నుంచి వైదొలగాలని కీవ్‌పై మాస్కో ఒత్తిడి తెస్తోంది. ఈ షరతును ఎప్పటికీ అంగీకరించబోమని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది.