ఓటుకు నోటు కేసు ఆధారాలన్నీ న్యాయస్థానంలో ఉన్నాయి : శిఖా గోయల్
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) : నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి డేటా నష్టపోలేదని, ఒకవేళ మావద్ద లేకపోయినా కోర్టు వద్ద ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ డైరక్టర్ జనరల్ శిఖా గోయల్ తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఉదయం 10.08 నిమిషాలకు ఎఫ్ఎస్ఎల్ లో అగ్నిప్రమాదం జరిగిందని, ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారని చెప్పారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారని, 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. మంటలు క్రమంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్‌కు వ్యాపించాయని తెలిపారు. అనాలసిస్ డాక్యుమెంట్‌లో కొన్ని ఫైల్స్ దగ్దమయ్యాయని, వాటిని గుర్తించే పని కొనసాగుతోందన్నారు.
2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయని తెలిపారు. కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందుపరిచామని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని వెల్లడించారు. ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. కేసు యధావిధిగా నడుస్తుందన్నారు. అలాగే 2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫఎసఎల్‌కి వచ్చాయి అని, మిగతా మెటీరియల్ అసిస్ట్ చేశాం అని, ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి అని శిఖా గోయల్ తెలిపారు. వీటిని రిట్రివ్ చేస్తాం అని స్పష్టం చేశారు. ప్రమాదంపై విచారణ జరుగుతుంది అని తెలిపారు. ప్రమాదంలో ఇంత వరకు ఎంత నష్టం జరిగిందన్నదానిపై స్పష్టత లేదు అని, ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. 7 ఆధారాలు మినహా మిగతా వాటిని కోర్టుకు సమర్పించినట్లు శిఖా గోయల్ పేర్కొన్నారు. ఏదైనా కేసులకు సంబంధించిన ఆధారాలు, పరికరాలను ఎఫ్ఎస్ఎల్ జాగ్రత్తగా ఉంచుతందని, డేటాను టీమ్ రిట్రీవ్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. మీడియా, ప్రజలు నిరాధారమైన ఆరోపణలు నమ్మవద్దని, పూర్తి విచారణ అనంతరం అన్ని వివరాలు మళ్లీ వెల్లడిస్తామని ఆమె చెప్పారు. అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ లోని ఎక్కువ సదుపాయాలు సాధారణంగానే పనిచేస్తున్నాయని, నష్టం జరిగిన సదుపాయాలను త్వరలోనే అన్నీ పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.



