కోదండరాంపై కేసు నమోదు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) :
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాంపై కరీంనగర్‌లో కేసు నమోదైంది. కరీంనగర్‌ కవాతులో మంత్రి శ్రీధర్‌బాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ స్థానిక టూటౌన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కోదండరాంపై ఐపీసీ 153, 153(ఏ) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు అధికార దాహంతో ప్రజల ఆకాంక్షను గుర్తించడం లేదని కోదండరాం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, కోదండరాంపై కేసు నమోదు కావడంతో జేఏసీ నాయకులు, తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వాక్‌ స్వేచ్ఛ కూడా పోయిందని వారు విమర్శిస్తున్నారు.వెంటనే కేసులను ఎత్తేయాలని, లేకుంటే ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.