” కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ ద్రోహులు”
హైదరాబాద్, జనంసాక్షి : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నట్లుగా తనపై వస్తున్న వార్తలను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్‌రెడ్డి ఖండించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై జగన్ పార్టీ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని , ఆపార్టీలో తాను చేరతాననడం కుట్రే అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సీమాంధ్ర పార్టీలకు తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారని చెప్పారు.
శ్రీకాంతాచారి ఫోటో పెట్టుకుని దీక్ష చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని రవీందర్‌రెడ్డి విమర్శించారు. ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టులకోసమే కోమటిరెడ్డి బ్రదర్స్ జగన్ జపం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పార్టీలో చేరేవారంతా తెలంగాణ ద్రోహలేనిన, వారంతా తెలంగాణ ముసుగులో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని అన్నారు. జగన్ పార్టీలో చేరేవారికి డిపాజిట్లు కూడా రావని చెప్పారు. టీఆర్‌ఎస్ నుంచి ఎవరూ బయటకు వెళ్ళబోరని అన్నారు.



