గంజాయి పై ఉక్కు పాదం పెద్దపల్లిలో డ్రోన్లతో నిఘా

share on facebook

యువతను చిత్తు చేస్తున్న గంజాయి నియంత్రణకు పెద్దపల్లి పోలీసులు పకడ్బందీ చర్యలు ప్రారంభించారు. గంజాయి పై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపెల్లి పోలీసులు గంజాయి సరఫరా నియంత్రణకు దృష్టి సారించారు. శనివారం పెద్దపెల్లి సిఐ ప్రదీప్ కుమార్ అధ్వర్యంలో గంజాయిని వినియోగిస్తున్న ప్రాంతాలను గుర్తించి, గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులతో పాటు వినియోగిస్తున్న వ్యక్తులను పట్టుకునేందుకు డ్రోన్లతో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్ట తో పాటు రైల్వేస్టేషన్, బండారి కుంటలోని కెనాల్ ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో గంజాయి వినియోగిస్తున్న వ్యక్తులను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గంజాయి నియంత్రణకు పూర్తిస్థాయిలో చర్యలు ప్రారంభించామన్నారు. గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారి వివరాలను సేకరించి వారి కదలికలపై నిఘా పెంచామన్నారు. ఇప్పటికే వారిపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేశామని, తీరు మారకపోతే పీడీ యాక్ట్ పెట్టేందుకు వెనకాడమన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు రాజేష్, రాజ వర్ధన్, సహదేవ్ సింగ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Other News

Comments are closed.